బెంగాల్‌లో మరో సంచలనం.. మమత వార్నింగ్‌ ఆడియో లీక్‌ | Mamata Banerjee Warning Giving Audio Leaked With Hospital CEO After Abhishek Banerjee Issue, Watch Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో మరో సంచలనం.. మమత వార్నింగ్‌ ఆడియో లీక్‌

May 31 2026 11:59 AM | Updated on May 31 2026 2:50 PM

Mamata Banerjee audio Leaked hospital CEO after Abhishek Issue

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఆందోళనకరంగా మారాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల అభిషేక్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ క్రమంలో కోల్‌కతాలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రి సీఈవోకు ఆమె వార్నింగ్‌ ఇస్తున్న ఆడియో బయటకు వచ్చింది. దీంతో, ఇది కాస్త రాజకీయ దుమారం రేపింది. అభిషేక్‌ బెనర్జీపై సోనార్‌పుర్‌లో దాడి అనంతరం.. ఆయనను చికిత్స కోసం బెల్‌ వ్యూ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ బెల్‌ వ్యూ ఆసుపత్రి సీఈవో ప్రదీప్ టాండన్‌ను హెచ్చరిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. ‘టాండన్‌ మీరు తప్పుచేశారు. మేము మీకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీ అహంకారాన్ని గుర్తుంచుకుంటాం. మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆస్పత్రిని నడుపుతున్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. తర్వాత వాళ్లు అధికారం కోల్పోతే.. మేం చేయాల్సింది చేస్తాం’ అని ఆడియోలో ఉంది.

అయితే, అభిషేక్‌ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్‌ చేయాలంటూ బీజేపీ నాయకులు, ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఆస్పత్రిపై ఒత్తిడి తెచ్చారని మమత ఆరోపించారు. తన మేనల్లుడికి ఏమైనా జరిగితే ఆసుపత్రిదే బాధ్యత అని మండిపడ్డారు. కాగా, ప్రస్తుతం అభిషేక్‌ బెనర్జీకి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు మమత తెలిపారు. కాగా.. ఈ దాడికి సంబంధించి పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా.. సోనార్‌పుర్‌లో అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి తర్వాత ఆయన ఛాతీలో రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని మమత తెలిపారు. అభిషేక్‌కు హెల్మెట్ పెట్టకపోయి ఉంటే ఆయన చనిపోయి ఉండేవాడని ఆరోపించారు. ప్రజలు రాళ్లు విసరడం, శారీరకంగా దాడి చేయడం వల్ల తన మేనల్లుడి ఛాతీ, పక్కటెముకల ప్రాంతంలో గాయాలయ్యాయని పేర్కొన్నారు. అభిషేక్‌కు సరైన చికిత్స అందించకుండా ఉండేందుకు ఆసుపత్రులకు పైనుంచి ఒత్తిడి ఉందని విమర్శించారు. అలాగే, అభిషేక్ సోనార్‌పుర్ పర్యటన గురించి పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, వారు ఎందుకు తగిన భద్రత ఏర్పాట్లు కల్పించలేకపోయారని ప్రశ్నించారు. హింసను సృష్టించేందుకే బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆరోపించారు. బీజేపీ చట్ట ప్రకారం పనిచేయాలని కోరారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఎవరికి చికిత్స చేయాలి? ఎవరికి చేయకూడదు? అనే దానికి బీజేపీ నుంచి అనుమతి కావాలని మండిపడ్డారు. అంత అమానవీయంగా బీజేపీ తయారయ్యిందని ఫైర్ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement