మహిళా రిజర్వేషన్లపై ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ: ఎంతో కీలకమైన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఇతర అంశాలను తేల్చకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై చర్చించడం వృథా ప్రయాసేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీన రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన వెంటనే అఖిల పక్ష భేటీని ఏర్పాటు చేసి వీటిపై చర్చ జరపాలని కోరారు. ఈ మేరకు ఖర్గే ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.
రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని హడావుడిగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా, డీలిమిటేషన్ తీరును వివరించకుండానే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో సభలో అర్థవంతమైన చర్చ ఎలా సాధ్యమని భావిస్తున్నారంటూ ఖర్గే నిలదీశారు. మరోవైపు, మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లో జాప్యంతో కోట్లాది మంది మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాశారు.


