అవినీతిలో మహారాష్ట్ర టాప్‌.. త‌ర్వాత స్టేట్‌..? | Maharashtra Tops in Corruption cases NCRB report details | Sakshi
Sakshi News home page

NCRB Report: అవినీతిలో మహారాష్ట్ర టాప్‌

Oct 25 2025 7:13 PM | Updated on Oct 25 2025 7:46 PM

Maharashtra Tops in Corruption cases NCRB report details

నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో వెల్లడి

28 శాతం అవినీతితో అగ్రస్థానం

గతేడాది దేశవ్యాప్తంగా 2,875 అవినీతి కేసుల

మహారాష్ట్రలో అత్యధికంగా 795 కేసులు

దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 795 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబరు రెండో తేదీ వరకు 530 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 785 ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో 28 శాతం అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివరాలు నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన జాబితా ద్వారా వెల్లడయ్యాయి.  

టీఎంసీ డీసీ అవినీతి కేసు సంచలనం 
థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ (టీఎంసీ) డిప్యూటీ కమిషనర్‌ శంకర్‌ పాటోలేను ఇటీవల అవినీతి కేసులో అరెస్టు చేశారు. ఈ ఘటన థానే, ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన అవినీతిపరుల జాబితా మరింత సంచలనం రేపింది. దీంతో విధినిర్వహణలో ఉన్న అధికారులు, మాజీ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులు మహారాష్ట్రపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.  

తరువాత స్ధానాల్లో రాజస్ధాన్, కర్ణాటక, గుజరాత్‌  
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే సామాన్యుల పనులు జరగవనేది జగమెరిగిన సత్యం. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అంచం తీసుకోవడం నేరం– ఇవ్వడం కూడా నేరమే అవుతుందని పెద్దపెద్ద అక్షరాలతో రాసిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ విషయం అందరికి తెలిసినా పనుల కోసం లంచం చెల్లించడం పరిపాటిగా మారింది. మరికొందరు అడిగినంత ఆమ్యామ్యా ఇవ్వలేక, అవినీతిని ప్రొత్సహించలేక అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

వారు పథకం ప్రకారం కాపు కాస్తారు. ఆ తరువాత లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసులు నమోదు చేస్తారు. ఆ తరువాత వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెడతారు. ఇలా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలను ఏసీబీ అధికారులు ఎన్‌సీఆర్‌బీకి నివేదిస్తారు. రాష్ట్రాల వారీగా అవినీతి కేసుల సంఖ్యను విడివిడిగా తెలియజేస్తారు. ఇందులో భాగంగా ఇటీవల ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసిన అవినీతి, లంచం కేసులకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర (Maharashtra) అగ్రస్ధానంలో ఉంది.

ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మహారాష్ట్రలో 795 కేసులు నమోదుకాగా ఆ తరువాత స్ధానంలో రాజస్ధాన్‌ (284), మూడో స్ధానంలో కర్ణాటక (245), నాలుగో స్ధానంలో గుజరాత్‌ (183) ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని వివిధ నగరాలు, జిల్లాల వారీగా పరిశీలిస్తే ముంబై, థానే సహా నాసిక్, పుణే, ఛత్రపతి సంభాజీనగర్‌ అవినీతిలో టాప్‌లో ఉన్నాయి.  

అక్క‌డ ఒక్క అవినీతి కేసు లేదు!
ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో అస్సాం, సిక్కిం (Sikkim) మినహా అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌లలో ఒక్క అవినీతి కేసు నమోదు కాలేదు. కాగా అస్సాంలో 91, సిక్కింలో కేవలం ఒక్కటే అవినీతి కేసు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక (NCRB Report) వెల్లడించింది.

చ‌ద‌వండి: ఇదేం విచిత్రం.. చెట్ల‌కు సెల్‌ఫోన్లు ఎందుకు?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement