
బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఆపాలని విపక్ష సభ్యుల డిమాండ్
అర్ధంతరంగా మంగళవారానికి వాయిదా
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) అంశం మరోసారి పార్లమెంట్‌ను స్తంభింపజేసింది. పార్లమెంట్ ఉభయ సభల సభాకార్యకలాపాలకు బదులు ఎస్‌ఐఆర్ అంశంపైనే చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్‌సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక లోక్‌సభలో విపక్షసభ్యుల నిరసనల కారణంగా కనీసం ఒక్క బిల్లు కూడా సభామోదానికి నోచుకోలేదని అధ్యక్షస్థానంలో ఉన్న స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
నినాదాలు మాని విపక్షసభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తిచేసినా ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం లోక్‌సభ మొదలుకాగానే విపక్ష సభ్యులు తమ సీట్లలోంచి లేచి వెల్‌లోకి దూసుకొచ్చారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించాలని నినాదాలుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక, ఎస్‌ఐఆర్ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటల వరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ ఇదే అంశంపై చర్చకు మొండిపట్టుబట్టారు. దీంతో సభాధ్యక్షస్థానంలో కూర్చున్న జగదాంబికాపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘‘ఈరోజు రెండు కీలక క్రీడా బిల్లులను సభలో చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఇలా నినాదాలు, ఆందోళన చేయడంతో భారతీయ క్రీడాకారులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం’’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు, క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సైతం ఇదే తరహాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నినాదాల హోరు మధ్యే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కస్టమ్స్ సుంకాలకు సంబంధించిన తీర్మానాన్ని చేశారు.
ఈ తీర్మానం సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘‘వర్షాకాల సమావేశాలు జూలై 21వ తేదీన మొదలైనప్పటి నుంచీ మీరు సభ జరక్కుండా ఆటంకం కల్గిస్తున్నారు. ఇలా వరసగా గత మూడు వారాలుగా అవరోధాలు సృష్టిస్తున్నారు’’అని జగదాంబికాపాల్ వ్యాఖ్యానించి సభను మంగళవారానికి వాయిదావేశారు. ‘‘తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నారన్న ఆశతో మిమ్మల్ని లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకుని లోక్‌సభకు పంపించారు. మీరేమో ఇలా నినాదాలు చేస్తూ ముఖ్యమైన బిల్లులు చర్చకు రాకుండా, సభామోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. సభా గౌరవాన్ని మీరంతా కించపరుస్తున్నారు’’అని ఓం బిర్లా సైతం వ్యాఖ్యానించడం తెల్సిందే.
సోరెన్ మరణంతో రాజ్యసభ వాయిదా
రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణానికి సంతాప సూచికగా రాజ్యసభలో ఎలాంటి అంశాలను చర్చకు స్వీకరించలేదు. బిల్లులనూ ప్రవేశపెట్టలేదు. రాజ్యసభ సోమవారం ఉదయం ప్రారంభంకాగానే సోరెన్ మరణ వార్త, సంతాప సందేశాన్ని సభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ్యులందరికీ చదివి వినిపించారు. ‘‘గిరిజనుల హక్కుల కోసం అవిశ్రాంతంగా సోరెన్ పోరాడారు’’అని సోరెన్‌ను హరివంశ్ గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి గౌరవ సూచికగా సభలో ఎలాంటి చర్చను డెప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. సభను మంగళవారానికి వాయిదావేశారు. 2020 జూన్‌లో సోరెన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు.