పహల్గాం దాడి, సిందూర్‌పై నేడు పార్లమెంటులో చర్చ | Lok Sabha to Hold Special Discussion on Operation Sindoor and Pahalgam attack | Sakshi
Sakshi News home page

పహల్గాం దాడి, సిందూర్‌పై నేడు పార్లమెంటులో చర్చ

Jul 28 2025 3:57 AM | Updated on Jul 28 2025 7:00 AM

Lok Sabha to Hold Special Discussion on Operation Sindoor and Pahalgam attack

మారథాన్‌ చర్చను నిర్వహించనున్న ఉభయ సభలు 

న్యూఢిల్లీ: వారం రోజులపాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార, ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరు పక్షాల అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. 

అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్‌ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, విదేశాంగ మంత్రి  తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్‌ ఠాకూర్, సుధాంషు త్రివేది, నిషికాంత్‌ దూబేలతోపాటు.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీయే సభ్యులు సైతం మాట్లాడతారు. 
ఇక ప్రతిపక్ష నాయకులు రాహుల్‌ గాంధీ, 

మల్లికార్జున్‌ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు, ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. భారత్‌–పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం తానే వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిని విదేశాంగశాఖ తోసిపుచ్చినా.. ట్రంప్‌ అవే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. 

ఇక, ప్రధాని మోదీ మౌనం వహించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. మరోవైపు... కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ మాత్రం ఉగ్రవాద దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో పార్టీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా? లేదా? అనే సంశయం నెలకొంది.  

విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌ 
ఆపరేషన్‌ సిందూర్‌పై సోమవారం నుంచి పార్లమెంట్‌లో చర్చ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్‌ జారీ చేసింది. వరుసగా మూడు రోజులపాటు తప్పనిసరిగా పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై పార్లమెంట్‌ దిగువ సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సైతం సభలో సమాధానం చెబుతారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement