సాంకేతికతే సర్వస్వం కాదు.. మోదీ హితవు

Log Into Technology But Don't Shun Social Life, Sports - Sakshi

విద్యార్థులకు ప్రధాని మోదీ హితవు

గాంధీనగర్‌: సాంకేతిక పరిజ్ఞానం నుంచి ప్రేరణ పొందాలే తప్ప, విద్యార్థులకు అదే జీవితం కాకూడదని ప్రధాని మోదీ హితవు పలికారు. క్రీడలు, సామాజిక జీవితం నుంచి మమేకం కావాలనే విషయం మర్చిపోరాదన్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో పర్యటిస్తున్న ప్రధాని సోమవారం అహ్మదాబాద్‌లోని విద్యాసమీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ‘సాంకేతికతతో కలిగే లాభాలను మీరు ప్రత్యక్షంగా చూశారు. టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుంటే, ప్రపంచమే మీ ముందు సాక్షాత్కరిస్తుంది. అన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయి. అదే సర్వస్వం అనుకోవద్దు. క్రీడలు, సామాజిక జీవితం వంటి వాటిని మర్చిపోకూడదు’అని పేర్కొన్నారు.

21న ఎర్రకోట నుంచి ప్రసంగం
న్యూఢిల్లీ: సిక్కుల గురువు గురు తేజ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీతో సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో గురు తేజ్‌ బహదూర్‌ స్మారక నాణెం, పోస్టల్‌ స్టాంప్‌ కూడా ఆయన విడుదల చేస్తారని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా చేపడుతున్న ఈ ఉత్సవంలో దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన వివరించారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top