సినిమా స్టైల్‌లో జైలు నుంచి ఎగ్జిట్‌ ఇచ్చిన జీవితఖైదీ | Life Convict Walked Out Of Bengaluru Jail Using Fake Court Order 8 Years Ago | Sakshi
Sakshi News home page

సినిమా స్టైల్‌లో జైలు నుంచి ఎగ్జిట్‌ ఇచ్చిన జీవితఖైదీ

May 25 2026 10:01 AM | Updated on May 25 2026 10:01 AM

Life Convict Walked Out Of Bengaluru Jail Using Fake Court Order 8 Years Ago

బెంగళూరు: ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలంటూ నకిలీ ఉత్తర్వులను చూపి ఓ ఖైదీ దర్జాగా విడుదలయ్యాడు. 8 ఏళ్ల తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన జీవితఖైదీ శంకర్‌ ఆర్ముగం కథ ఇది. 2001లో బెంగళూరు వద్ద  శంకర్‌ ఆర్ముగం ముఠా ఓ వ్యక్తిని కిడ్నాప్, హత్య చేసింది. ఈ కేసు సుదీర్ఘ విచారణ  తరువాత బెంగళూరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు శంకర్‌ ఆర్ముగంకు యావజ్జీవిత శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. 

దీంతో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. జైలులో నుంచి బయటకు రావడానికి  ఓ పథకం వేశాడు. అనారోగ్య కారణాల వల్ల విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ముద్ర, సంతకం ఉన్న నకిలీ రికార్డులను సృష్టించాడు. 2018 నవంబరు 13న రూ.10 వేల చలానా కట్టి కుటుంబ సభ్యులు అధికారులకు చెల్లించి నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను చూపించారు. అధికారులు నిజమే అనుకుని అతనిని విడుదల చేశారు.  

ఆకాశవాణి లేఖతో తెలిసింది  
ఇటీవల జైళ్ల శాఖ డీజీపీకి గుర్తుతెలియని లేఖ వచ్చింది. శంకర్‌ ఆర్ముగం నకిలీ రికార్డుల గురించి ప్రస్తావించారు. దీంతో జైలు అధికారులు విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు నుంచి అలాంటి విడుదల ఆదేశాలు రాలేదని స్పష్టమైంది. దీంతో అతని మీద స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేయగా, గాలింపు చేపట్టారు. సుప్రీం ఉత్తర్వులు అనగానే ఖైదీని ఎలా విడుదల చేశారు, ఇందులో జైలు అధికారులు కుమ్మక్కయ్యారా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని జైలుశాఖ అధికారులు తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement