సుర లోకానికి అమర స్వరం | Legendary Indian playback singer Asha Bhosle has passed away in Mumbai | Sakshi
Sakshi News home page

సుర లోకానికి అమర స్వరం

Apr 13 2026 1:47 AM | Updated on Apr 13 2026 1:47 AM

Legendary Indian playback singer Asha Bhosle has passed away in Mumbai

ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే కన్నుమూత  

ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 

సంతాపం ప్రకటించిన రాజకీయ, సినీ ప్రముఖులు  

నేడు ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

‘ఈనా మీనా డీకా’.. ఆమెది రాక్‌ ఎన్‌ రోల్‌ స్వరం. ‘పియా తూ అబ్‌ తో ఆజా’.. ఆమెది నర్తించే గళం. ‘ఆజా ఆజా మై హూ ప్యార్‌ తేరా’.. ఆమెది యుగళ గీతం. ‘దిల్‌ చీజ్‌ క్యా హై ఆప్‌ మేరే జాన్‌ లీజియే’... ఆమెది బరువైన వేదనా జాలం. ఆశా భోంస్లే. డాన్సింగ్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా. నర్తించే గళం. 12000 పాటలు పాడి దశాబ్దాల పాటు భారతీయ శ్రోతల జీవితాల్లో హుషారును నింపి నేడు స్వరసుర లోకానికి బయలుదేరింది. దివ్య పుష్పమై దేవలోక ‘లత’కు చేరింది. బాలీవుడ్‌ గోల్డెన్‌ ఎరా ముగింపుకొచ్చింది. ఆశా భోంస్లే మరణ వార్త విని అభిమానులు చేస్తున్న వేడుకోలు–  ‘అభీనా జావో ఛోడ్‌కర్‌ కె దిల్‌ అభీ భరా నహీ’....

ముంబై: దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన అద్భుత గాత్రం మూగబోయింది. కోట్లాది అభిమానులను ఉర్రూతలూగించిన అసమాన స్వర ఝరి శాశ్వతంగా ఆగిపోయింది. ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల ఆశా చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌తోపాటు శ్వాస సంబంధిత సమస్యతో శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారని ఆశా భోంస్లే మనవరాలు జనై భోంస్లే ప్రకటించారు. 

సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆశా అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు లోయర్‌ పరేల్‌లోని కాసా గ్రాండ్‌లో అభిమానులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించవచ్చని కుమారుడు ఆనంద్‌ తెలిపారు. ఆశా మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. లెజెండరీ సింగర్‌ దూరం కావడం చిత్ర పరిశ్రమలకు, అభిమానులకు తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

సుదీర్ఘ కాలం పాడిన రికార్డు 
ఆశా భోంస్లే 1933 సెప్టెంబర్‌ 8న మహారాష్ట్రలోని సాంగ్లీలో సంప్రదాయ మరాఠీ కుటుంబంలో జన్మించారు. ఆమె సోదరీమణుల్లో ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్, సోదరుడు హృదయనాథ్‌ మంగేష్కర్‌ ఉన్నారు. తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ ప్రోత్సాహంతో ఆశ సంగీతం నేర్చుకున్నారు. 1943లో పదేళ్ల వయసులో మరాఠీ చిత్రం ‘మజా బల్‌’లో తొలి గీతం ఆలపించారు. 2010 దశకం వరకూ పాడుతూనే ఉన్నారు. సుదీర్ఘ కాలం పాటలు పాడిన సింగర్‌గా రికార్డుకెక్కారు. గాయనిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2000 సంవత్సరంలో దాదాసాహెబ్‌ ఫాలే్క, 2008లో పద్మభూషణ్, 2018లో బంగ భూషణ్, 2021లో మహారాష్ట్ర భూషణ్‌ అవార్డులు ఆమెను వరించాయి. జాతీయ అవార్డులు, గౌరవాలకు లెక్కేలేదు. 

ఆశా భోంస్లే 1949లో 16 ఏళ్ల వయసులోనే గణపతిరావు భోంస్లేను వివాహం చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు పుట్టాక వారు విడిపోయారు. అనంతరం ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఆర్‌.డి.బర్మన్‌ను పెళ్లాడారు. 80 ఏళ్లలో 14 భాషల్లో 12,000కు పైగా పాటలతో అభిమానులను రంజింపజేశారు. యాదోం కీ బారాత్, హమ్‌ దోనో, హరే రామ హరే కృష్ణ, డాన్, నమక్‌ హలాల్, ఉమ్రావ్‌ జాన్, కిస్మత్, మేరా సాయా, తీస్రీ మంజిల్, మేరా జీవన్‌ సాథీ తదితర చిత్రాల్లో ఆశ పాడిన పాటలు దశాబ్దాలుగా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఆశ వంట కూడా అద్భుతంగా చేస్తారన్న పేరుంది. ‘ఆశాస్‌’పేరిట ఇంటర్నేషనల్‌ రెస్టారెంట్‌ చైన్‌ను ఏర్పాటు చేశారు. చాలా దేశాల్లో రెస్టారెంట్లు నెలకొల్పారు. 

భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారు: ముర్ము 
ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచంలో ఒక తీరని లోటును సృష్టించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. దిగ్గజ గాయనిగా ఆశ సాగించిన అద్భుత ప్రస్థానం భారత సంగీత చరిత్రలో ఒక యుగాన్ని సృష్టించిందని కొనియాడారు. ఆమెతో వ్యక్తిగతంగా సంభాషించిన తీపి జ్ఞాపకాలు తనకున్నాయని వెల్లడించారు. మధురమైన, చిరస్థాయిగా నిలిచిపోయే స్వరంతో దశాబ్దాల పాటు భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారని ప్రశంసించారు. ఆమె సంగీతం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆశా భోంస్లే వైవిధ్యమైన స్వరం అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుందని ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. అన్ని రకాల పాటలు, హృద్యమైన గజల్స్, సంప్రదాయ భజనలతో ఆకట్టుకున్నారని తెలిపారు. 
 
భావి తరాలకు స్ఫూర్తి: మోదీ 
దిగ్గజ గాయని ఆశా భోంస్లే మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆమె పాటలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని ‘ఎక్స్‌’లో స్పష్టంచేశారు. దశాబ్దాల పాటు సాగిన ఆమె అసాధారణ సంగీత ప్రస్థానం భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసిందని, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని హృదయాలను స్పృశించిందని ఉద్ఘాటించారు. దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత ప్రఖ్యాత గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోంస్లే మరణం తనకు తీవ్ర విచారం కలిగించిందన్నారు. 

ఆమెతో తన సంభాషణలు మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని వెల్లడించారు. ఆశా భోంస్లే కుటుంబానికి, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రధాని మోదీ సానుభూతి ప్రకటించారు. భవిష్యత్‌ తరాలకు ఆమె ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటారని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్‌ తదితరులు కూడా సంతాపం ప్రకటించారు. ఆశా భోంస్లే మృతిపట్ల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంతాపం తెలియజేశారు. భారతీయ సంగీత రంగంలో ఒక శకం ముగిసిందని పేర్కొన్నారు. ఆమె తన విలక్షణ గాత్రం ద్వారా ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారని వివరించారు.   

Advertisement
 
Advertisement
Advertisement