
కోటా: పోటీ ప్రవేశ పరీ క్షలకు ప్రసిద్ధి చెందిన రాజస్తాన్‌లోని కోటా పట్ట ణం ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ఏడాది ఏకంగా 20 మంది విద్యార్థులు బలవన్మ రణానికి పాల్పడడంతో జిల్లా యంత్రాంగం ఆత్మహత్యల నిరోధానికి ఎన్నో చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్‌తోపాటు యోగా తరగతులు ప్రారంభించింది.
ఫ్యాన్‌కు ఉరేసుకుని చాలా మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్‌లను స్ప్రింగ్‌లకు బిగించారు. ఇప్పుడు తాజాగా అన్ని హాస్టల్ భవనాలకు వలలు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు భవనాలపైకి ఎక్కి దూకకుండా ‘సూసైడ్ ప్రూఫ్’ వలలు బిగించే కార్యక్రమాన్ని అన్ని హాస్టళ్లు యుద్ధప్రాతిపదికన అమరుస్తున్నాయి. ‘భవనాల వెలుపల, బాల్కనీల్లోనూ పెద్ద పెద్ద వలలు బిగించాం.
ఇవి 150 కేజీల బరువులను సైతం మోయగలవు. ఎవరైనా విద్యార్థి భవనంపై నుంచి దూకినా ఈ వలలో పడతారు. గాయాలు కావు’ అని అమ్మాయిల హాస్టల్ నిర్వహిస్తున్న వినోద్ గౌతమ్ వివరించారు. ‘ఫ్యాన్‌లకు స్ప్రింగ్‌లు, భవనాలకు వలల కారణంగా విద్యార్థుల ఆత్మహత్యలను దాదాపు అడ్డుకోవచ్చు. విద్యార్థులను హాస్టల్స్‌లో విడిచి వెళుతున్న తల్లిదండ్రులు ఆందోళనతో ఉంటారు. ఇలాంటి నివారణ చర్యల కారణంగా తల్లిదండ్రుల్లో ధైర్యం కాస్తంత ఎక్కువ అవుతుంది’ అని గౌతమ్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి చర్యలు తాత్కాలికంగా ఆత్మహత్యలను నిరోధించగలవేమో. కానీ విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించాలి. అదే అసలైన పరిష్కారం’ అని కొందరు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.