ఓబీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక | Kharge addresses in Congress OBC Leadership meet bhagidari nyay sammelan | Sakshi
Sakshi News home page

ఓబీసీల కోసం ప్రత్యేక ప్రణాళిక

Jul 26 2025 2:01 AM | Updated on Jul 26 2025 2:01 AM

Kharge addresses in Congress OBC Leadership meet bhagidari nyay sammelan

‘భాగీదారీ న్యాయ సమ్మేళనం’లో బీసీ నేతలతో కలిసి అభివాదం చేస్తున్న రాహుల్‌గాంధీ. చిత్రంలో మంత్రి వాకిటి శ్రీహరి, మధుయాష్కీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ తదితరులు

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే 

సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యం 

బీసీనని చెప్పుకునే మోదీ 11 ఏళ్లలో బీసీలకు చేసిందేమీ లేదు 

ఓబీసీల కోసం ఇక రెట్టింపు వేగంతో పని చేయబోతున్నా: రాహుల్‌గాంధీ 

తెలంగాణలో చేసిన కులగణన ఓ రాజకీయ భూకంపమని వ్యాఖ్య 

ఏఐసీసీ ఓబీసీ విభాగం ‘భాగీదారీ న్యాయ సమ్మేళనం’లో నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం కొత్త పథకాలు తీసుకురావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వెనుకబడిన వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందజేయడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. ఓబీసీలను అభ్యున్నతి వైపు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై పార్టీ ఆధ్వర్యంలో ఒక నక్షా (ప్రణాళిక) సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. విభజించి పాలించడమే మోదీ ప్రభుత్వ విధానమని దుయ్యబట్టారు. తాను బీసీనని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ గడచిన 11 ఏళ్లలో ఓబీసీల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ఏఐసీసీ ఓబీసీ విభాగం నిర్వహించిన ‘భాగీదారీ న్యాయ సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. 

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విషం లాంటివి.. 
‘తెలంగాణలో ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేశారు. కర్ణాటకలో కూడా చేస్తున్నారు. దాని ఆధారంగా వారికి పథకాలు రూపొందిచాలని ముఖ్యమంత్రులకు సూచించాం. సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని కోరాం. తెలంగాణ, కర్ణాటక సర్వేల్లో అగ్రకులాలకు చెందినవారు 5, 10 శాతం ఉన్నారని తెలుస్తోంది. వీళ్లే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే వీళ్ల దగ్గర విద్య, మానసిక బలం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విషం లాంటివి. ఆ విషాన్ని ఒక్కసారి రుచి చూద్దామనుకుంటే చనిపోతారు. ఓబీసీ కులగణన చేయాలని మొట్ట మొదటిసారిగా రాహుల్‌గాంధీ చెప్పారు. గతంలో ఎవరూ చెప్పలేదు. అలాంటి రాహుల్‌గాం«దీకి మద్దతిస్తారా? లేక దేశాన్ని ముక్కలు చేసేవారికా? ఆలోచించుకోవాలి..’అని ఖర్గే అన్నారు. 

మోదీ అబద్ధాలకు సర్దార్‌ 
‘బీసీ అయిన నన్ను కాంగ్రెస్‌ వాళ్లు వేధిస్తున్నారని ప్రధాని మోదీ పదే పదే అంటున్నారు. మేము కాదు.. మోదీయే అందరినీ వేధిస్తున్నారు. అందరినీ మట్టిలో కలిపేసి ఆయన ఒక్కడే సజీవంగా ఉండాలనుకుంటున్నారు. మోదీజీ ఎప్పడూ అబద్ధాలే చెబుతారు. ఆయన అబద్ధాలకు సర్దార్‌. పార్లమెంటులో కూడా అసత్యాలు చెబుతారు. అబద్ధాలు చెప్పే ప్రధాని దేశం, సమాజానికి మంచి చేయలేరు..’అని ఖర్గే ధ్వజమెత్తారు. 

ఓబీసీ వర్గాలను రక్షించుకోవడంలో వెనుకబడ్డా: రాహుల్‌గాంధీ 
ఓబీసీ వర్గాన్ని రక్షించే విషయంలో నేను వెనుకబడ్డా. మీ సమస్యలను ఆ సమయంలో నేను లోతుగా అవగాహన చేసుకోలేదు. 10, 15 ఏళ్ల ముందు దళితులు, ఆదివాసీల సమస్యలను అర్థం చేసుకోగలిగా. కానీ ఓబీసీల సమస్యలను లోతుగా అర్థం చేసుకోలేకపోయా. ఇది కాంగ్రెస్‌ పార్టీ తప్పు కాదు.. కచి్చతంగా నా తప్పే. ఆ సమయంలోనే కులగణన చేయించి ఉంటే..ఇప్పడు నేను చేయించాలనుకున్నట్లుగా ఉండేది కాదు. ఓబీసీల కోసం ముందుగా నేను చేయలేకపోయిన పనిని ఇప్పుడు రెట్టింపు వేగంతో చేయబోతున్నా..’అని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తెలిపారు. 

తెలంగాణ సర్కారు వద్ద ఉన్న డేటాకు తిరుగులేదు.. 
‘తెలంగాణలో చేసిన కులగణన ఒక రాజకీయ భూకంపం. అది దేశ రాజకీయాలను కుదిపేసింది. దాని తర్వాత పరిణామాలు ఇంకా మీరు చూడలేదు. గతంలో ఒకసారి సునామీ వచ్చింది. రెండు మూడు గంటల తర్వాత దాని ప్రభావం కనిపించింది. అదే తెలంగాణలోనూ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో ఉన్న డేటాకు దేశంలో ఎక్కడా ఎదురులేదు. ఆ డేటా ఆధారంగా తెలంగాణలోని మొత్తం కార్పొరేట్‌ సంస్థల్లో ఎంతమంది ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు ఉన్నారనేది ఒక్క నిమిషంలోనే చెప్పవచ్చు.

అయితే తెలంగాణలో కార్పొరేట్లలో ఎంతమంది ఓబీసీ యజమానులు, దళిత యజమానులు ఉన్నారు? అక్కడ లక్షలు, కోట్ల రూపాయల ప్యాకేజీలు లభిస్తాయి. కానీ ఓబీసీలకు ఎంత ప్యాకేజీ లభిస్తోందని అడిగితే..నేను జీరో అంటాను. అక్కడ దళితులు, ఓబీసీలు, ఆదివాసీల్లో ఎవ్వరికీ ఇలాంటి ప్యాకేజీలు దక్కడం లేదు. దేశంలో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలే కూలీ పనిచేస్తారు..’అని రాహుల్‌ పేర్కొన్నారు. 

ఉత్పాదక శక్తికి గౌరవం దక్కాలి 
‘ఏ దేశాన్ని అయినా నడిపించేది ఉత్పదక శక్తే. అలాంటి శక్తికి దేశం ఏం ఇస్తోంది? రోడ్లు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు, ఆలయాలు నిర్మించేది మీరే. ఈ పని కోసం దేశం మీకు ఏం ఇస్తోంది? నేను ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు ఊరుకోను. కులగణన ఒక్కటే కాదు.. ఉత్పాదక శక్తికి దేశంలో గౌరవం దక్కాలన్నదే నా లక్ష్యం. దేశ ఉత్పాదక శక్తి చరిత్రను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు కలిసి చెరిపేసే ప్రయత్నం చేశాయి. పాఠ్య పుస్తకాల్లో ఓబీసీల చరిత్ర ఎక్కడుంది? దేశంలో 55, 60 శాతం ఉన్న ఓబీసీల చరిత్రను కావాలనే చెరిపేశారు.

ఎప్పుడైతే మీరు మీ చరిత్ర తెలుసుకుంటారో ఆ రోజు ఆర్‌ఎస్‌ఎస్‌ మీ శత్రువు అని తెలుసుకుంటారు. మా ప్రభుత్వాలు ఉన్నచోట ముందుగా కులగణన ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ చేస్తాం. ఓబీసీలు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు? భాగస్వామ్యం ఎంత? అనేది తేలుతుంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో కుల గణన, 50 శాతం అడ్డుగోడలు పడగొతాం..’అని కాంగ్రెస్‌ అగ్రనేత చెప్పారు. 

ఇంగ్లిష్‌తో డబుల్‌ బ్యారెల్‌ ప్రోగ్రెస్‌ 
‘చదువు ఉన్నవారు వేగంగా అభివృద్ధి చెందుతారని తెలంగాణ సర్వేలో తెలిసింది. విద్యతో పాటు మీ దగ్గర ఇంగ్లిష్‌ ఉంటే డబుల్‌ బ్యారెల్‌ ప్రోగ్రెస్‌ ఉంటుందని తేలింది. ఇంగ్లిష్‌ను దేశం నుంచి తొలగించేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రాంతీయ భాషలు ఎంతో అవసరం. కానీ దాంతో పాటు ఇంగ్లిష్‌ కూడా అవసరం. అందుకే మా మూడో నినాదం ప్రైవేట్‌ విద్యా విధానంలో దళితులకు, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించడమే..’అని రాహుల్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీలు అనిల్‌కుమార్‌ యాదవ్, సురేష్‌ షెట్కార్, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య, రాజస్తాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లోట్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ భగేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement