
ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. వాడవాడలా ఉత్సవ సందడి నెలకొంది. గణపతి నుంచి పలు అంశాలు నేర్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. అలాగే ఆర్ధిక నిపుణులు కూడా గణపయ్యను చూసి, పొదుపు పాఠాలు నేర్చుకోవచ్చంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నింటినీ వినే సామర్థ్యం కలిగిన పెద్ద చెవులు
గణేశుని పెద్ద చెవులు.. మనం ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అందుకు సంబంధించిన అవసరమైన అన్ని సమాచారాలను శ్రద్ధగా వినాలనే విషయాన్ని గుర్తుచేస్తాయి. పెట్టుబడులు పెట్టేముందు బలమైన పోర్ట్‌ఫోలియోను గుర్తించడం ఎంతో ముఖ్యం. తాజా పరిణామాలను ఎంత ఎక్కువగా వింటే, ఆర్థికంగా ముందుకు సాగడానికి అంత బాగా సన్నద్ధం కావచ్చని ఆర్థికరంగ నిపుణులు చెబుతుంటారు.
జ్ఞానానికి పెద్ద శిరస్సు
వినాయకుని పెద్ద శిరస్సు .. లోతైన జ్ఞానం, విస్తృత దృష్టి, జ్ఞానాన్ని సూచిస్తుంది. పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే ముందు వీటిని గుర్తుంచుకోవాలి. లక్ష్యాలను, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని విశ్లేషించాలి. స్టాక్‌లు లేదా మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ తప్పనిసరి.
చక్కని దృష్టి కోసం చిన్న కళ్ళు
చిన్న కళ్ళతో గణేశుడు.. చురుకైన దృష్టి, ఏకాగ్రతను గుర్తు చేస్తాడు. నష్టాలను నివారించడానికి, స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి తీక్షణమైన దృష్టి అవసరం
ఫ్లెక్సిబిలిటీ కోసం పొడవైన తొండం
గణేశునికి పొడవైన తొండం ఉంటుంది. ఇది బలాన్ని, ఫ్లెక్సిబిలిటీని, ఏ దిశలోనైనా కదలగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. అదే రీతిలో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేటప్పుడు ఫ్లెక్సిబిలిటీతో ఉండాలి. విభిన్నమైన స్టాక్‌లు లేదా మ్యూచువల్ ఫండ్‌ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండాలి.
ప్రతిదీ జీర్ణం చేసేలా పెద్ద బొడ్డు
గణేశుని పెద్ద బొడ్డు.. ఇది జీవితంలోని అన్ని అనుభవాలను, మంచి, చెడు రెండింటినీ జీర్ణించుకునే శక్తిని, సామర్థ్యాన్ని సూచిస్తుంది. పెట్టుబడిదారులు పెట్టుబడి నుండి రాబడిని పొందేందుకు ఓపికగా ఉంటూ, పెట్టుబడి పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.