
వీటిపై ఉన్న 5–18 శాతం పన్ను ఎత్తివేత ఆరోగ్య, జీవిత బీమాపై పన్ను సున్నా
గణనీయంగా తగ్గనున్న వాహన ధరలు
ఎలక్ట్రిక్ వాహనాలపై 5శాతం పన్ను.. టూత్‌పేస్ట్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్‌పై 5 శాతం
సిగరెట్లు, గుట్కాలు, కూల్‌డ్రింక్స్ విలాస వస్తువులపై 40 శాతం
రెండు శ్లాబుల విధానానికి ఏకగ్రీవ ఆమోదం
ఈ నెల 22 నుంచి అమల్లోకి
జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్‌టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. చపాతీ, పరోటా, బ్రెడ్డు, బన్నులపై జీఎస్‌టీని పూర్తిగా తొలగించాలని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన భేటీ అయిన జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయించింది.
అంతేకాదు కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్య, జీవిత బీమాపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్‌టీని ఎత్తివేయనుంది. దీంతో ఆ మేరకు వాటి ప్రీమియంలు తగ్గనున్నాయి. ఇకపై జీఎస్‌టీలో 5, 18 శాతం పన్ను శ్లాబులే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబుల్లోని వస్తువులు 5, 18 శాతం శ్లాబుల్లోకి మారనున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3 శాతం ఇక ముందూ కొనసాగనుంది.
ప్టెంబర్ 22 నుంచే (దేవీ నవరాత్రి వేడుకలు మొదలయ్యే రోజు) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి.
కార్మీకుల ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చాం’’అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యాపార నిర్వహణ సైతం సులభతరం అవుతుందని, నిబంధనల అమలు సరళంగా మారుతుందన్నారు. తాజా పన్ను శ్లాబుల క్రమబద్దీకరణతో రూ.48,000 కోట్ల ఆదాయం తగ్గిపోనుందని, ద్రవ్యపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ నిర్ణయాలతో దేశీ వినియోగం మరింత పెరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. మన జీడీపీలో 61.4 శాతం వినియోగం రూపంలోనే సమకూరుతుండడం గమనార్హం. జీఎస్‌టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన రెండో ఏడాదిలో జీడీపీ వృద్ధి 0.5 శాతం మేర అదనంగా నమోవుతుందని ఆర్థిక వేత్తల అంచనా. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లు దేశ ఆర్థిక వృద్ధిని 0.20–0.50 శాతం ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలు నెలకొనగా.. జీఎస్‌టీ సంస్కరణలతో ఈ ప్రభావం సమసిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వీటి ధరలు దిగొస్తాయ్..
ప్రస్తుతం బ్రాండెడ్ బ్రెడ్, బ్రెడ్ ఉత్పత్తులపై 5–18 శాతం మేర జీఎస్‌టీ అమల్లో ఉండగా ఇది తొలగిపోనుంది. పరాటాపై 18 శాతం, చపాతీ, యూహెచ్‌టీ పాలపై 5 శాతం రేటును ఎత్తివేయనున్నారు. నిత్యావసరాలైన టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు షుగర్ కన్ఫెక్షనరీ, జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్‌క్రీమ్, పండ్ల రసాలు, కార్న్‌ఫ్లెక్స్ తదితర ఉత్పత్తులపై 18 శాతం జీఎస్‌టీ 5 శాతానికి తగ్గిపోనుంది.
ఇక వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నీచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్‌పై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి దిగిరానుంది. ఇంటి నిర్మాణంలోకి వినియోగించే సిమెంట్‌పైనా పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. 350 సీసీ ఇంజన్ సామర్థ్యం వరకు ఉన్న ద్విచక్ర మోటారు వాహనాలు, ఏసీలు, డిష్‌వాషర్లు, టీవీలు (32 అంగుళాలకు పైన) తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువులపైనా ధరల భారం 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరానుంది.
ప1,200 సీసీ, 4,000 ఎంఎం పొడవు మించని పెట్రోల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ వాహనాలు, 1,500 సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాలపైనా పన్ను రేటు 18 శాతానికి తగ్గనుంది. 1,200 సీసీ నుంచి 4,000 ఎంఎం కంటే పొడవైన మోటారు వాహనాలు, 350సీసీకి పైన ద్విచక్ర వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు (వ్యక్తిగత వినియోగానికి), రేసింగ్‌కార్లు, క్యాసినోలు/గ్యాంబ్లింగ్/గుర్రపు పందేలు/లాటరీలపై 40 శాతం పన్ను రేటు అమలవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఎప్పటి మాదిరే 5 శాతం పన్ను కొనసాగనుంది.
పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతానికి 28 శాతం
సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపైనా 40 శాతం పన్ను రేటును ప్రతిపాదించారు. అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిపై 28 శాతం జీఎస్‌టీ, దీనిపై కాంపన్సేషన్ సెస్సును కొనసాగించనున్నారు. రాష్ట్రాలకు ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రుణాలను తిరిగి పూర్తిగా చెల్లించేంత వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఆ తర్వాత వీటిపైనా 40 శాతం పన్ను రేటు అమలు కానుంది. ఇది ఎప్పటి నుంచి అన్నది జీఎస్‌టీ మండలి తర్వాత నిర్ణయిస్తుంది.
పౌరుల జీవనం మెరుగుపడుతుంది
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు, జీఎస్‌టీ సంస్కరణలకు జీఎస్‌టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు సామాన్యులకు, రైతులు, ఎంఎస్‌ంఎఈలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం కలిగిస్తాయి. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాపార నిర్వహణ అన్నది, ముఖ్యంగా చిన్న వర్తకులు, వ్యాపారులకు సులభతరం అవుతుంది’’
– ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రధాని మోదీ స్పందన