దక్షిణాది ఒక్కటైతే దేశ రాజకీయాలే మారిపోతాయి: కేతిరెడ్డి | kethireddy-jagadeeswara-reddy Raise Voice Against Delimitation | Sakshi
Sakshi News home page

దక్షిణాది ఒక్కటైతే దేశ రాజకీయాలే మారిపోతాయి: కేతిరెడ్డి

Apr 15 2026 2:19 PM | Updated on Apr 15 2026 2:21 PM

kethireddy-jagadeeswara-reddy Raise Voice Against Delimitation

తమిళనాడు: దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక ఐక్య ఉద్యమం ప్రారంభమైంది. దేశ సమగ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వివక్షాత్మక విధానాలపై గళం విప్పాల్సిన అవసరం ఏర్పడిందని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పేర్కొన్నారు. డిలిమిటేషన్‌ను ప్రస్తుతం వెంటనే అమల్లోకి తీసుకురాకూడదని, దక్షిణాది రాష్ట్రాల వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.

ఆ ప్రకటనలో కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ డిలిమిటేషన్ అంశంపై స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు:“దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న అన్యాయాన్ని ఇక మేము సహించము. మా హక్కుల కోసం అవసరమైతే మరింత పెద్ద స్థాయిలో పోరాటం చేస్తాము.”దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటికీ దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచాయని, కానీ ప్రాతినిధ్యం, వనరుల పంపిణీ, విధానాల అమలు విషయంలో జరుగుతున్న వివక్షను ఇకపై సహించబోమని ఆయన అన్నారు. ఈ ఉద్యమం కేవలం ఒక ప్రాంతం కోసం కాకుండా — సమానత్వం, న్యాయం, ఫెడరల్ స్ఫూర్తి కోసం సాగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.“దక్షిణాది ఒకటైతే దేశ రాజకీయ దిశ మారుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాది వివక్షపై తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్టు చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్న మొత్తం ఎంత, తిరిగి వాటికి లభిస్తున్న వాటా ఎంత అనే ప్రశ్న నేపథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక మరియు తమిళనాడు ముఖ్యమంత్రులు, అలాగే వివిధ ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసి దక్షిణాది హక్కుల పరిరక్షణ అంశాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు.

అందులో భాగంగా హోసూర్‌లో ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా డిలిమిటేషన్ (పరిధుల పునర్విభజన) ప్రక్రియలో ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య పెరగడంలో అన్యాయం జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తప్పకుండా ప్రజలందరూ ఉప్పొంగే తరంగంలా ముందుకు వచ్చి ఉద్యమానికి సిద్ధం కావాలని, రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా కలిసి పోరాటం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement