'ప్లాస్టిక్‌ ఇచ్చి బంగారం తీసుకోండి'.. దెబ్బకు 15 రోజుల్లోనే

Kashmir Village Starts Give Plastic Take Gold Idea Makes Plastic Free - Sakshi

ఆ గ్రామ సర్పంచ్‌ వినూత్న ఆలోచనతో జస్ట్‌ 15 రోజుల్లోనే ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా మారి ఆ ఊరు ఆదర్శంగా నిలిచింది. అతను అమలు చేసిన ఆ ఆలోచన త్వరితగతిన చక్కటి ఫలితం ఇవ్వడమేగాక ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చింది. వివరాల్లోకెళ్తే.. కాశీర్మర్‌లోని సదివార పంచాయితీ పర్యావరణ పరిరక్షణ చొరవలో భాగంగా ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ గ్రామ సర్పంచ్‌, వృత్తి రీత్యా న్యాయవాది అయిన ఫరూక్‌ అహ్మద్‌ 'ప్లాస్టిక్‌ ఇచ్చి బంగారం తీసుకోండి' అనే నినాదంతో ఒక ప్రత్యేక కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ పథకం కింద ఎవరైనా 20 క్వింటాళ్ల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించి ఇస్తే వారికి పంచాయితీ బంగారు నాణేలను అందజేస్తోంది. దీన్ని ఆ ఊరి గ్రామపెద్దలు ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా బాగా ప్రచారం చేశారు. ప్రచారం ప్రారంభించిన 15 రోజుల్లోనే ఊరంతా స్వచ్ఛంగా మారింది. అంతేగాక అధికారులు కూడా ప్లాస్టిక్‌​ రహిత గ్రామంగా ప్రకటించడం విశేషం. ఈ నినాదం ప్రజాదరణ పొందడమే గాక అందరిచే ప్రశంసలందుకుంది. ఇతర గ్రామ పంచాయితీలు కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చాయి. 

ఈ మేరకు సర్పంచ్‌ ఫరూఖ్‌ మాట్లాడుతూ.. మా గ్రామంలోని వాగులు, నదులు శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగంగానే ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొచ్చాను. దీంతో గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోగలిగారు. అలాగే రోడ్డు, వీధుల్లో కుప్పలు తెప్పలుగా ప్లాస్టిక్‌ని పడేసిన గ్రామం ఇప్పుడూ పూర్తిగా క్లీన్‌గా ఉంది.  

ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవడమే గాక ప్రభుత్వం కూడా దీన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని గ్రామల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వ పథకం కాకపోయినా ప్రజలంతా ఆసక్తిగా ముందుకు వచ్చి మరీ ప్లాస్టిక్‌ సేకరించారని అనంత్‌నాగ్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అన్నారు. కాగా, ఈ గ్రామం దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలోని హిల్లర్‌ షహాబాద్‌ బ్లాక్‌లో ఉంది.
(చదవండి:  స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయ్‌..స్పీడ్‌ పెంచేయడంతో..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top