తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంజీఆర్, జయలలిత, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధిలు సూపర్ సక్సెస్ అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు మాత్రం ఒక స్థాయి వరకే పరిమితం అయ్యారు. రజనీ కాంత్ లాంటి బడా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు విజయ్ ఎంట్రీ ‘మార్పు’ తేవొచ్చనే అంచనాలను రేకెత్తిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ వాతావరణానికి మళ్లీ సినిమా రంగు పులుముకుంది. అధికార పార్టీ డీఎంకే పశ్చిమ తమిళనాడు నిజయోకవర్గాల ప్రచారానికి తన మిత్రుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌ను రంగంలోకి దించింది. అయితే ఇది విజయ్‌కు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.
ఆదివారం రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ తరఫున ప్రచారం చేశారు. మన నియోజకవర్గం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. మెట్రో ప్రాజెక్టును నిరాకరించిన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీవీకే అనేది అక్కడ పోటీలోనే లేదన్నట్లు కమల్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
కోయంబత్తూరు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా దానిని చేజక్కించుకునేందుకు కమల్‌ను ముందు ఉంచింది. కమల్‌కు ఈ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగానూ అనుబంధం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ప్రచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన కమల్.. బాలాజీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే..
తమిళనాట టీవీకే అధినేత విజయ్‌కి యువత, మహిళలు, జెన్‌జీ ఓటర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే.. హోలోగ్రామ్‌లు, కటౌట్లు, సోషల్ మీడియా ద్వారా ఆయన తన ప్రచారాన్ని విస్తృతస్థాయిలో ఉధృతం చేశారు. పైకి పట్టనట్లే కనిపిస్తున్నప్పటికీ.. విజయ్ ప్రచారాన్ని డీఎంకే సీరియస్‌గానే తీసుకుంది. విజయ్ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌లో డీంఎకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిచీ ఈస్ట్ డీఎంకేకు బలమైన స్థానమే అయినా టీవీకే ఎంట్రీతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో.. కమల్‌ను ‘స్టార్’ క్యాంపెయినర్‌గా సీన్‌లో ఉంచింది.
కమల్ ఇప్పటికే చెపాక్–తిరువల్లిక్కేని నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోసం ప్రచారం చేశారు. మరో 15 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం బ్యాలెన్స్ ఉంది. ఇందులో పెరంబూర్, త్రిచీ ఈస్ట్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్‌ను కమల్ హాసన్ నేరుగా టార్గెట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
కరూర్ తొక్కిసలాట, జన నాయగన్ చిత్రానికి సెన్సార్ నిరాకరణ అంశాల్లో విజయ్‌కు కమల్ హాసన్ నేరుగా మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కోసం ఆయన దళపతిని విమర్శించాల్సిన పరిస్థితి. అదే జరిగితే.. విజయ్ కూడా లోకనాయకుడి(ఉళగ నాయగన్)పై ఎదురు దాడి చేయాల్సి వస్తుంది. అంటే.. ఇదంతా తమిళనాడులో స్టార్‌ల మధ్య నేరుగా రాజకీయ పోరాటాన్ని ఆసక్తికరంగా మార్చుబోతోందన్నమాట.


