కొనుగోలు అనుమానాలు.. ఎమ్మెల్యేలను రాష్ట్రం దాటించిన కాంగ్రెస్‌

Jharkhand Upa Mlas Reached Resort In Raipur - Sakshi

చార్టర్డ్‌ విమానంలో రాంచీ నుంచి రాయ్‌పూర్‌కు తరలింపు  

మేఫెయిర్‌ రిసార్ట్‌కు చేరుకున్న 32 మంది సభ్యులు  

ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి యూపీఏ ప్రయత్నాలు 

ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొంటాం.. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ 

రాంచీ: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బేరసారాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు అధికార యూపీఏ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 32 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు మంగళవారం తరలించింది. వీరంతా తొలుత జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ నివాసం నుంచి రెండు బస్సుల్లో రాంచీ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. సోరెన్‌ వెంట వచ్చారు. సోరెన్‌ మినహా ఇతర ఎమ్మెల్యేలు చార్టర్ట్‌ విమానంలో సాయంత్రం 4.30 గంటలకు రాంచీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 5.30 గంటలకు రాయ్‌పూర్‌లోని వివేకానంద ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నారు.

దగ్గర్లోని నవ రాయ్‌పూర్‌లోని మేఫెయిర్‌ రిసార్ట్‌కు చేర్చారు. ఎమ్మెల్యేలు మకాం వేసిన రిసార్ట్‌ చుట్టూ ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ చెప్పారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81 కాగా, అధికార యూపీఏకు 49 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేయడానికి తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసే అవకాశం ఉందని యూపీఏ అనుమానిస్తోంది. యూపీఏలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్నాయి. జేఎంఎంకు 30, కాంగ్రెస్‌కు 18, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

భవిష్యత్తు కార్యాచరణపై చర్చ  
జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం సూచించినప్పటికీ గవర్నర్‌ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజ్‌భవన్‌ మౌనం వహిస్తుండడంపై యూపీఏ ఎమ్మెల్యేల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ఆస్కారం కల్పిస్తున్నారంటూ గవర్నర్‌ తీరును ఆక్షేపిస్తున్నారు. త్వరగా నిర్ణయం తీసుకోవాలని, రాజకీయ అనిశ్చితిని తొలగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు మంగళవారం హేమంత్‌ సోరెన్‌ నివాసంలో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. జార్ఖండ్‌ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్‌ 1న సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top