
షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్
సూళ్లూరుపేట: గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగమైన జీవన్–1 ప్రయోగాన్ని ఈ ఏడాదిలోనే చేపడతామని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. శుక్రవారం షార్‌లో మీడియాతో మాట్లాడారు. జీవన్–1 అనంతరం జీ–2, జీ–3 లాంటి ప్రయోగాలుంటాయని తెలిపారు. పలు ప్రయోగాల అనంతరం 2035లో మానవ సహిత గగన్‌యాన్ మిషన్ ఉంటుందని పేర్కొన్నారు.
జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా ప్రయోగించిన నైసార్ అద్భుతంగా పనిచేస్తోందని, ఆ ఉపగ్రహానికి ఉన్న 12 అడుగుల యాంటెన్నా కూడా విజయవంతంగా విచ్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే పీఎస్‌ఎల్‌వీ ఎన్1 పేరుతో చేపట్టే మరో 5 ప్రయోగాలు కూడా వాణిజ్యపరమైనవేనని చెప్పారు. ఎల్‌ఎవీఎం3 ఎం5 ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని లేదా ఈఓఎస్ ఉపగ్రహాన్ని కాని ప్రయోగించే అవకాశముందని వివరించారు. పీఎస్‌ఎల్‌వీ సీ62, సీ63 ప్రయోగాలు కూడా ఈ ఏడాది ఉంటాయని తెలిపారు.