
జమ్ము కశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మంది సిబ్బందికి గాయాలతో చికిత్స పొందుతున్నారు.
మొత్తం 23 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బంకర్ వాహనం బసంత్‌గఢ్ నుంచి గురువారం ఉదయం తిరుగు పయనం అయ్యింది. అయితే.. 10.30గం. ప్రాంతంలో కాంద్వా వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించగా.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు కన్నుమూశారు.
క్షతగాత్రులకు స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. సదరు వాహనం 187వ బెటాలియన్‌కు చెందిందిగా నిర్ధారించారు. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారాయన.
