ఆ చమురు నౌక చైనాకు మళ్లింది!  | Iranian Oil Tanker Shifts Course From India To China | Sakshi
Sakshi News home page

ఆ చమురు నౌక చైనాకు మళ్లింది! 

Apr 4 2026 5:05 AM | Updated on Apr 4 2026 6:08 AM

Iranian Oil Tanker Shifts Course From India To China

6 లక్షల బ్యారళ్లతో భారత్‌ బయల్దేరిన ‘పింగ్‌ షున్‌’ 

ఉన్నట్టుండి చైనాలోని డోంగ్‌యింగ్‌కు మళ్లిన వైనం 

చెల్లింపుల అంశమే కారణం కావచ్చని అనుమానాలు
 

 

న్యూఢిల్లీ: 6 లక్షల బ్యారెళ్ల ఇరాన్‌ చమురుతో భారత్‌కేసి బయల్దేరిన పింగ్‌ షున్‌ అనే నౌక తన ప్రయాణ దిశను ఉన్నట్టుండి చైనా వైపు మార్చుకుంది! ముందుగా నిర్దేశించిన మేరకు ఈ చమురు నౌక గుజరాత్‌లోని వదినార్‌ రేవుకు చేరాల్సి ఉంది. మూడు రోజులుగా నౌక ప్రయాణం వదినార్‌ వైపే సాగింది. అక్కడికి కొద్ది దూరంలో ఉండగా శుక్రవారం ఉన్నట్టుండి చైనాలోని డోంగ్‌యింగ్‌ కేసి మళ్లినట్టు నౌకల ప్రయాణాన్ని గమనించే ‘కోలా డేటా’పేర్కొంది. 

పింగ్‌ షున్‌ తాజాగా తన గమ్యస్థానాన్ని డోంగ్‌యింగ్‌గానే చూపుతున్నట్టు తెలిపింది. ఈ నౌక గనక భారత్‌ చేరితే ఏడేళ్ల అనంతరం ఇరాన్‌ నుంచి మన దేశానికి తొలిసారి చమురు దిగుమతి జరిగేది. ఈ నౌకలోని చమురు తాలూకు క్రయ, విక్రయదార్ల వివరాలు వెల్లడి కాలేదు. ఎస్వాతిని దేశపు జెండాతో కూడిన ఈ చమురు నౌక ఈ వారం మొదట్లో భారత్‌కు బయల్దేరింది. ఇప్పుడిలా సముద్ర మధ్యంలో ఉన్నట్టుండి చైనా వైపు ఎందుకు మళ్లిందన్నది తెలియాల్సి ఉంది. 

బహుశా చెల్లింపుల అంశమే దీనికి ప్రధాన కారణమై ఉంటుందని కోలా అభిప్రాయపడింది. ‘‘చమురు చెల్లింపులకు సరఫరా కంపెనీలు గతంలో కనీసం 30 నుంచి 60 రోజుల గడువిచ్చేవి. కానీ పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు సరఫరా పూర్తిగా అడుగంటి డిమాండ్‌ చుక్కలనంటింది. దాంతో కంపెనీలు తక్షణ చెల్లింపులను డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకు ముందుకొచ్చే దేశాలకే పెద్దపీట వేస్తున్నాయి’’అని పేర్కొంది. 

ఇరాన్‌ చము రును సరఫరా చేస్తోందంటూ పింగ్‌ షున్‌ నౌకపై 2025లో అమెరికా నిషేధం విధించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ఎత్తేయడం తెలిసిందే. దాంతో ఇప్పటికే సముద్రంలో ఉన్న ఇరాన్‌ చమురు నౌకలపై మన చమురు కంపెనీలన్నీ జల్లెడ పడుతున్నాయి. ఆ క్రమంలోనే పింగ్‌ షున్‌ ఇరాన్‌ చమురుతో భారత్‌కేసి బయల్దేరి తాజాగా ఉన్నట్టుండి చైనా బాట పట్టింది. 

అయితే, చెల్లింపు సంబంధిత అంశాలు కొలిక్కి వచ్చే పక్షంలో ఈ నౌక భారత్‌కే వచ్చే అవకాశాలూ లేకపోలేదని ‘కోలా’లో ప్రధాన పరిశోధకునిగా పని చేస్తున్న సుమిత్‌ రిటోలియా చెప్పుకొచ్చారు. చమురు కొనుగోళ్ల కోసం ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ముమ్మర పోటీకి ఈ ఉదంతం తాజా నిదర్శనమన్నారు. 2018 వరకు భారత్‌కు అతి పెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఇరాన్‌ కూడా ఉండేది. మన చమురు దిగుమతుల్లో ఇరాన్‌ వాటా 11.5 శాతం దాకా ఉండేది. 2019లో ఇరాన్‌ చమురుపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది. దాంతో ఇరాన్‌ చమురు కొనుగోళ్లను భారత్‌ నిలిపేసింది.

Advertisement
 
Advertisement
Advertisement