ఆసక్తికరం.. తమిళనాడు మంత్రుల నేపథ్యం! | Interesting Details Over Tamil Nadu Cabinet Ministers | Sakshi
Sakshi News home page

ఆసక్తికరం.. తమిళనాడు మంత్రుల నేపథ్యం!

May 22 2026 7:21 AM | Updated on May 22 2026 7:27 AM

Interesting Details Over Tamil Nadu Cabinet Ministers

సాక్షి, చెన్నై: సీఎం విజయ్‌ కేబినెట్‌లో కొత్తగా అడుగు పెట్టిన 23 మందిలో పలువురికి సంబంధించిన విద్యా ప్రయాణం, రాజకీయ అనుభవం తదితర వివరాలు వెలుగులోకి వచ్చాయి. అనేక మంది విజయ్‌ మక్కల్‌ ఇయక్కం నుంచే రాజకీయాలలోకి రాగా, మరి కొందరు వైద్యులు, న్యాయవాదులుగా, ఇంకొందరు రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి వచ్చిన వారు ఉన్నారు.  

ఎన్‌. మరియా విల్సన్‌:  తమిళనాడులో ప్రముఖ విద్యాసంస్థల అధినేత, దివంగత ‘జేప్పియార్‌’ అల్లుడు (జేప్పియార్‌ కుమార్తె రెజినా భర్త). జేప్పియార్‌ రెమిబాయ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా, జేప్పియార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యక్షుడిగా ఉన్నారు. పీహెచ్‌డీ  పూర్తి చేశారు.

ఏ. శ్రీనాథ్‌ : సీఎం విజయ్‌ అత్యంత ఆప్తమిత్రుడు. 1992లో విజయ్‌ కథానాయకుడిగా పరిచయమైన ’నాళైయ తీర్పు’ చిత్రం ద్వారానే శ్రీనాథ్‌ కూడా సినీరంగంలోకి ప్రవేశించారు. విజయ్‌తో కలిసి అనేక చిత్రాలలో నటించారు.  ఎన్నికల్లో సీనియర్‌ డీఎంకె మంత్రి గీతా జీవన్‌ను తూత్తుకుడిలో ఓడించి సంచలనం సృష్టించారు. 52 ఏళ్ల శ్రీనాథ్‌ 12వ తరగతి చదివారు.

ఎస్‌. కమలి : రాసిపురం ప్రాంతానికి చెందిన ఈమె కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ను ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కేబినెట్‌లో అత్యంత పిన్న వయసు్కరాలైన మంత్రి ఈమె. 28 ఏళ్ల వయస్సులో మంత్రి అయిన కమలి  ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో పీజీ  పూర్తి చేశారు.

సి. విజయలక్ష్మి: టీవీకే పార్టీలో సీనియర్‌ మహిళా నాయకురాలు. అన్నాడీఎంకే సీనియర్‌ నేత పి. తంగమణిని ఓడించారు. రాజకీయాల్లోకి రాకముందు స్వయం ఉపాధి (సొంత బిజినెస్‌) చేసేవారు. 12వ తరగతి వరకు చదువుకున్నారు.  

డి. లోకేష్‌ తమిళసెల్వన్‌: అన్నాడీఎంకే  సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ పి. ధనపాల్‌ కుమారుడు. గత లోక్‌సభ ఎన్నికల్లో నీలగిరి నుండి అన్నాడీఎంకే   తరపున పోటీ చేశారు. తర్వాత టీవీకేలో చేరి, డీఎంకే మంత్రి మదివేందన్‌ను ఓడించారు. లయోలా కాలేజ్‌ నుండి బీకామ్, ఢిల్లీ ఐఐపీఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.  

పి. విశ్వనాథన్‌  (కాంగ్రెస్‌):  చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఈయన 2009–2014 మధ్య కాంచీపురం ఎంపీగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో సాధారణ (జనరల్‌) స్థానంలో పోటీ చేసి గెలిచిన ఒకే ఒక్క ఎస్సీ అభ్యర్థి ఈయనే కావడం విశేషం. మద్రాస్‌ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు.

ఆర్‌. కుమార్‌ : ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈయన, ఇటీవల ప్రతిష్టాత్మక ఐఐఎం బెంగళూరు నుండి బిజినెస్‌ లీడర్‌íÙప్‌ కోర్సు చేశారు.

విజయ్‌ తమిళన్‌ పార్తీబన్‌ : విజయ్‌ అభిమాన సంఘం (విజయ్‌ మక్కల్‌ ఇయక్కం) ద్వారా ఎదిగిన లాయలిస్ట్‌. సేలం పాత బస్టాండ్‌ వద్ద చిన్న మొబైల్‌ షాప్‌ నడుపుకునే స్థాయి నుండి నేడు పెద్ద షోరూమ్‌ అధినేతగా ఎదిగారు. విజయ్, బుస్సీ ఆనంద్‌కు అత్యంత నమ్మకస్తుడైన ఈయన 12వ తరగతి వరకు చదివారు.

ఎస్‌. రాజేష్‌ కుమార్‌  (కాంగ్రెస్‌):  కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత. కన్యాకుమారి జిల్లా కిళ్లీయూర్‌ నియోజకవర్గం నుండి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నేత. న్యాయశాస్త్రం చదివారు.

డి. శరత్‌కుమార్‌: డీఎంకే కోటగా భావించే తాంబరంలో ఆ పార్టీ అభ్యర్థి ఆర్‌.ఎస్‌. కృతికా దేవిని 35,621 ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. గతంలో సివిల్‌ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. జైన్‌ కాలేజీ నుండి బీబీఏ పూర్తి చేసిన  యువ ఎమ్మెల్యే.

ఆర్‌.వి. రంజిత్‌ కుమార్‌ : కాంచీపురం ఎమ్మెల్యే, వయసు 50 ఏళ్లు. ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ. వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు.

బి రాజ్‌కుమార్‌ :  వయసు 46 ఏళ్లు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా. రియల్‌ ఎస్టేట్‌ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.

బి. మదన్‌ రాజా: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్, సొంత వ్యాపారాలు ఉన్నాయి.  

విఘ్నేష్‌ : వయసు 38 ఏళ్లు. బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌. సీసీటీవీ కెమెరాల వ్యాపారం చేసేవారు. గత 15 ఏళ్లుగా విజయ్‌ మక్కల్‌ ఇయక్కంలో పనిచేస్తున్నారు.

వి. సంపత్‌కుమార్‌: కోయంబత్తూర్‌ నార్త్‌లో బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్‌ను ఓడించి సంచలనం çసృష్టించారు. అన్నామలై వర్సిటీ నుండి ఎంబీఏ (డిస్టెన్స్‌) చేశారు.

రాజీవి : వయసు 33 ఏళ్లు. వృత్తిరీత్యా డాక్టర్‌ (వైద్యుడు). టీవీకే యువ మంత్రుల్లో ఒకరు.

గాంధీరాజ్‌: వయసు 52 ఏళ్లు. 12వ తరగతి చదివారు. సివిల్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారు.

జెగదీశ్వరి.కె : గ్రాడ్యుయేట్‌. జర్నలిజం, మీడియా రంగంలో అనుభవం ఉంది.  

ఆర్‌. రమేష్‌ : 10వ తరగతి చదివారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి.

తెన్నరసు.కె : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత. కమీషన్‌ ఏజెంట్‌గా వ్యవహరిస్తూ, విజయ్‌ వీరాభిమానిగా ఉంటూ వచ్చారు.

మహమ్మద్‌ ఫర్వాజ్‌.జె : ప్రింటింగ్‌  ప్రెస్‌ నడుపుతూ విజయ్‌ అభిమానిగా ఉంటూ వచ్చారు.

సామాజిక సమతుల్యత:
కమలి, విస్వనాథన్, రాజ్‌మోహన్, లోకేష్‌ తమిళసెల్వన్, తెన్నరసు, గాంధీరాజ్, మదన్‌రాజాలు షెడ్యూల్‌ కులాలకు చెందిన నేతలు మంత్రులు కావడం విశేషం.

మహిళా శక్తిగా: ఎస్‌. కమలి, సి. విజయలక్ష్మి, కీర్తన, జగదీశ్వరి కేబినెట్‌లో ఉన్నారు. ఈ మంత్రివర్గ కూర్పులో అట్టడుగు స్థాయి కార్యకర్తలకు, యువకులకు, విద్యాధికులకు, సామాజిక సమీకరణాలకు సీఎం విజయ్‌ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement