
ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశలో కోవిడ్ నియంత్రణ లేని పట్టణాల్లో ఇండోర్ ఒకటి. తాజాగా రాష్ట్రంలో ఇండోర్ పట్టణంలోని ఆభరణాల దుకాణంలో 31 మంది ఉద్యోగులకు కరోనా సోకడంతో దాన్ని మూసివేశారు. ప్రస్తుత పరిస్థితిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా విలేకరులతో మాట్లాడుతూ.. గత వారం నుంచి దుకాణాన్ని సందర్శించిన వారిని అలానే వైరస్ సోకిన సిబ్బంది, కస్టమర్లను గుర్తించడం ప్రారంభించామన్నారు. వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు లేదా కోవిడ్ ఇతర లక్షణాలు ఉన్నాయా అని పరీక్షిస్తున్నామన్నారు. ఆభరణాల షోరూమ్ ని శుభ్రం చేస్తున్నామని, అది పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి తెరుస్తారని అధికారులు తెలిపారు.
గత కొన్ని నెలలతో పోల్చితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది దీపావళి, ధన్సార్ పండుగలను జరుపుకున్నారు. పండగ సందర్భంగా చాలా మంది షాపింగ్‌మాల్స్‌ని సందర్శించారు. దీని వలన కరోనా వ్యాప్తి పెరిగిందని అలానే ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన పర్యాటకులు, ప్రజలు మాస్క్ లేకుండా వీధుల్లో తిరుగుతూ, ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 1.86 లక్షలకు పైగా కరోనా బారిన పడగా 1,200 మంది మరణించారు. ఇండోర్ లో నిన్న ఒక్కరోజే 194 కొత్త కేసులు వెలుగు చూశాయి.