కొత్త రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న భారత్– అమెరికా
కౌలాలంపూర్‌లో రాజ్‌నాథ్, పీట్ హెగ్సెత్ సంతకాలు
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో సహకారాన్ని పొడిగించుకునేందుకు భారత్– అమెరికా కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ‘యూఎస్– ఇండియా మేజర్ డిఫెన్స్ పార్టనర్‌షిప్’పై కౌలాలంపూర్‌లో ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పీట్ హెగ్సెత్ శుక్రవారం సంతకాలు చేశారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ (ఏషియాన్) సమావేశాల్లో భాగంగా రాజ్‌నాథ్, హెగ్సెత్ రక్షణ ఒప్పందంపై చర్చలు జరిపారు.
రెండు దేశాల మధ్య 2015లో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ ఏడాదితో ముగుస్తుండటంతో దాని స్థానంలో మరో పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌ను అమెరికా తన ప్రధాన రక్షణ భాగస్వామిగా గుర్తిస్తుంది. దీంతో ఆ దేశం నుంచి కీలకమైన రక్షణ సాంకేతికతోపాటు ఆయుధాల దిగుమతులకు మార్గం సుగమం అవుతుంది. రెండు దేశాల సైన్యాల మధ్య సమాచార మార్పిడి, కీలక నిఘా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటాయి.
రక్షణ బంధం ద్విగుణీకృతం
తాజా ఒప్పందంతో భారత్– అమెరికా మధ్య రక్షణ సహకారం మరింత బలపడుతుందని రాజ్‌నాథ్‌సింగ్ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ‘భారత్–అమెరికా రక్షణ సంబంధాలకు ఈ డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ విధానపరంగా విస్తృతమైన మార్గదర్శనం చేస్తుంది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి ఈ ఒప్పందం ఉదాహరణ. హెగ్సెత్‌తో చర్చలు ఫలవంతం అయ్యాయి. రెండు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాల్లో రక్షణ సహకారం ప్రధానమైనది’అని పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వానికి మూలస్తంభం లాంటిదని హెగ్సెత్ తెలిపారు. సమాచార మార్పిడి, సాంకేతిక సహకారం విషయంలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందం భారత్–అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయమని భారత ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంయుక్తంగా భారత్‌లో ఎఫ్414 జెట్ ఇంజన్ల ఉత్పత్తి చేసే ప్రతిపాదనలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగిందని వెల్లడించింది. రక్షణ రంగంలో సహకారంపై ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే పలు ఒప్పందాలు ఉన్నాయి. 2016లో ‘లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రీమెంట్’, 2018లో కమ్యూనికేషన్స్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రీమెంట్, 2020లో బేసిక్ ఎక్స్‌ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రీమెంట్ చేసుకున్నారు.


