భారత ప్రభుత్వం బెదిరించింది 

India threatened to block Twitter says Jack Dorsey - Sakshi

రైతుల ఉద్యమ సమయంలోట్విట్టర్‌ ఖాతాలను నిలిపివేయాలని ఆదేశించింది  

మాట వినకపోతే భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామని హెచ్చరించింది.  

ట్విట్టర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే సంచలన ఆరోపణలు  

ఖండించిన పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు  

డోర్సే పచ్చి అబద్ధాలు  చెబుతున్నారని ఆగ్రహం  

డోర్సే ఆరోపణలపై మోదీ ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌  

న్యూఢిల్లీ:  భారత్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020, 2021లో పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం జరిగినప్పుడు ట్విట్టర్‌ ఖాతాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం తమను ఆదేశించిందని, మాట వినకపోతే దేశంలో ట్విట్టర్‌ను మూసివేస్తామని హెచ్చరించిందని జాక్‌ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడైన జాక్‌ డోర్సే 2021లో ఆ సంస్థ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఖాతాలపై ఆంక్షలు విధించడంతోపాటు కొన్ని పోస్టులను తొలగించకపోతే సంస్థను మూసివేయడంతోపాటు ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందని, తమపై ఒత్తిడి తెచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

తుర్కియే(టర్కీ), నైజీరియా ప్రభుత్వాల నుంచి కూడా తమకు బెదిరింపులు వచ్చాయని అన్నారు. చెప్పినట్లు చేయాలని అక్కడి ప్రభుత్వాలు తమపై ఒత్తిడి తెచ్చాయని పేర్కొన్నారు. భారత ప్రభుత్వంపై జాక్‌ డోర్సే చేసిన ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మంగళవారం కొట్టిపారేశారు. డోర్సే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. డోర్సే సీఈఓగా ఉన్న సమయంలో భారత ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా పనిచేసేందుకు ట్విట్టర్‌ యాజమాన్యం నిరాకరించిందని గుర్తుచేశారు. భారత ప్రభుత్వ చట్టాలు తమకు వర్తించవన్నట్లుగా వ్యవహరించిందని అన్నారు.

ట్విట్టర్‌ సంస్థ నుంచి ఎవరూ జైలుకు వెళ్లలేదని, మన దేశంలో ట్విట్టర్‌ను మూసివేయలేదని చెప్పారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే జాక్‌ డోర్సే పస లేని ఆరోపణలు చేస్తున్నారని రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆక్షేపించారు. జాక్‌ డోర్సే ఆరోపణలను కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్, బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, బీజేపీ ఐటీ విభాగం నాయకుడు అమిత్‌ మాలవీయ తదితరులు ఖండించారు. దేశానికి వ్యతిరేకంగా కొందరు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, అలాంటి వారి ఖాతాలపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో ట్విట్టర్‌ యాజమాన్యానికి సూచించామని రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు.  

కేంద్రం సమాధానం చెప్పాలి: ఖర్గే  
ట్విట్టర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే చేసిన ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియాను, జర్నలిస్టులను అణచివేయడం ప్రభుత్వం ఇకనైనా ఆపాలని అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటామని ఖర్గే తేల్చిచెప్పారు. డోర్సే ఆరోపణలపై మోదీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేశ్, రణదీప్‌ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌ తదితరులు డిమాండ్‌ చేశారు.       

ట్విట్టర్‌ ఖాతాలను బ్లాక్‌ చేశారు: తికాయత్‌  
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని ప్రముఖంగా వెలుగులోకి తీసుకొచ్చిన ట్విట్టర్‌ ఖాతాలను అప్పట్లో ప్రభుత్వం నిలిపివేసిన సంగతి నిజమేనని, ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్‌ చెప్పారు.

ఖాతాలను బ్లాక్‌ చేసేలా ట్విట్టర్‌ యాజమాన్యంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని అన్నారు. రైతుల ఉద్యమం ప్రజల్లోకి వెళ్లకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. చాలా ట్విట్టర్‌ ఖాతాలు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయని వివరించారు. అసమ్మతిని, వ్యతిరేకతను కేంద్రం సహించదని వ్యాఖ్యానించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top