
జేఎన్‌పోర్ట్ టెర్మినల్ రెండో దశను బటన్ నొక్కి ప్రారంభిస్తున్న సింగపూర్ ప్రధాని వాంగ్, మోదీ
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసుకోవాలని నిర్ణయం
ప్రధాని నరేంద్ర మోదీతో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భేటీ
పలు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఒక రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిణామాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. భారత్–సింగపూర్ మధ్య దౌత్యానికి మించిన గొప్ప అనుబంధం ఉన్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌తోపాటు ఇతర డిజిటల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై సింగపూర్‌తో కలిసి పోరాడుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. లారెన్స్ వాంగ్‌తో భేటీ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాలు ఉగ్రవాదం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడడం మానవత్వాన్ని విశ్వసించే అన్ని దేశాల బాధ్యత అని స్పష్టంచేశారు. భారత్–సింగపూర్ సంబంధాలకు కలిసి పంచుకుంటున్న విలువలు, ప్రయోజనాలే ప్రాతిపదిక అని పేర్కొన్నారు. శాంతి, సౌభాగ్యాలే రెండుదేశాల ఉమ్మడి లక్ష్యమని వివరించారు.
ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్–సింగపూర్ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఎన్నో రెట్లు పెరిగిందని లారెన్స్ వాంగ్ స్పష్టంచేశారు. మోదీ, వాంగ్ భేటీ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ పలు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మధ్య డిజిటల్ అస్సెట్ ఇన్నోవేషన్ ఒప్పందం కుదిరింది. అలాగే గ్రీన్ షిప్పింగ్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు కలిసికట్టుగా గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్(జీడీఎస్సీ)ను ఏర్పాటు చేయబోతున్నాయి.
జేఎన్‌పోర్ట్ పీఎస్‌ఏ టెర్మినల్ రెండో దశ ప్రారంభం
భారత, సింగపూర్ ప్రధానమంత్రులు మోదీ, లారెన్స్ వాంగ్ గురువారం ముంబైలో జేఎన్‌పోర్ట్ పీఎస్‌ఏ టెర్మినల్ రెండో దశను వర్చువల్‌గా ప్రారంభించారు. దీనివల్ల ఈ టెర్మినల్ కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యం 4.8 మిలియన్ టీఈయూలకు పెరగనుంది.