
న్యూఢిల్లీ: పాకిస్తాన్- సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదరడంపై భారత్ స్పందించింది. ఆ ఇరు దేశాల ఒప్పందంలో వివరాల ప్రకారం.. ఇరు దేశాలలోని ఎవరిపైన దాడి జరిగినా.. అది ఇరు పక్షాలపైన జరిగిన దాడిగానే పరిగణిస్తారు. అప్పుడు ఆ ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడుతాయని పేర్కొన్నారు. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ ఒప్పందపు పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తామని వెల్లడించింది.
‘సౌదీ అరేబియా- పాకిస్తాన్ మధ్య కుదిరిన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు వచ్చిన నివేదికలను చూశాం. రెండు దేశాల మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామ ప్రక్రియ పరిశీలనలో ఉందని భారత ప్రభుత్వానికి తెలుసు. మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామం వలన వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తాం. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు, అన్ని రంగాలలో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ ప్రధాని.. రియాద్‌ను సందర్శించారు అక్కడి అల్-యమామా ప్యాలెస్‌లో సౌదీ యువరాజు షరీఫ్‌ను కలిశారు. సౌదీ అరేబియా - పాకిస్తాన్ మధ్య పరస్పర రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం, రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని అభివృద్ధి చేయడం, ఏదైనా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఒప్పందపు ప్రకటన వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి.. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాక్- సౌదీల మధ్య కుదిరిన ఈ ఒప్పందం కీలకమైనదిగా భావిస్తున్నారు.