న్యూఢిల్లీ: నిష్క్రియాత్మక కారుణ్య మరణానికి (passive euthanasia) చట్టపరమైన ఆమోదం పొందిన భారతదేశంలోని తొలి వ్యక్తి హరీష్ రాణా కన్నుమూశారు. మంగళవారం (మార్చి 24) ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కన్నుమూశారు. దీంతో హరీష్ మరణం దేశ వైద్య-చట్టపరమైన రంగంలో ఒక కీలక ఘట్టంగా మిగిలింది.
మార్చి 11న సుప్రీంకోర్టు రాణా కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
పంజాబ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిగా ఉన్నప్పుడు, నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి తలకు తీవ్ర గాయాలైన 31 ఏళ్ల హరీష్ రాణా, 2013 నుంచి కోమాలో ఉన్నారు. గత దశాబ్దానికి పైగా కృత్రిమ పోషణ, అడపాదడపా ఆక్సిజన్ సహాయంతో రాణా జీవించారు.
నిపుణుల పర్యవేక్షణలో
మార్చి 14న రానాను ఘాజియాబాద్‌లోని తన నివాసం నుండి ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ రోటరీ క్యాన్సర్ హాస్పిటల్‌లోని పాలియేటివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, వైద్యుల పర్యవేక్షణలో రానాకు అందుతున్న కృత్రిమ పోషకాహార మద్దతును (Artificial Nutritional Support) క్రమంగా ఉపసంహరించారు. న్యూరో సర్జరీ, ఆంకో-అనస్థీషియా, పాలియేటివ్ మెడిసిన్, సైకియాట్రీ నిపుణులు సహా, డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని మల్టీడిసిప్లినరీ బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షించింది.
ప్యాసివ్ యుథనేషియా అంటే ఏమిటి?
కోలుకునే అవకాశం లేని రోగికి అందిస్తున్న కృత్రిమ జీవన మద్దతును (వెంటీలేటర్, ఫీడింగ్ ట్యూబ్స్ వంటివి) నిలిపివేయడం ద్వారా మరణం సంభవించేలా చేయడం. దీనిని సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకు అనుమతించింది.


