
పహాల్గమ్ ఉగ్రదాడి తరువాత.. భారత్ ప్రతీకారదాడులకు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. పాక్ ప్రతిదాడులకు ప్రయత్నించినప్పటికీ.. ఇండియన్ ఆర్మీ ముందు నిలబడలేకపోయింది. చేసేదేమీ లేక ఉద్రిక్తతలు తగ్గించాలని వేసుకోవడంతో.. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసారు.
భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో డీజీఎంవో (డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) అధికారులే కీలక పాత్ర పోషించారు. కాల్పుల విరమణ ప్రకటన రావడానికి ముందు పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉన్నత సైనిక అధికారి భారతదేశానికి ఫోన్ చేశారని, ఆ తర్వాత రెండు దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు.
కాల్పుల విరమణ ప్రకటన రావడానికి గంట ముందు, పాకిస్తాన్ భవిష్యత్తులో చేసే ఏదైనా ఉగ్రవాద చర్యను యుద్ధ చర్యగా పరిగణిస్తామని, భారతదేశం దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుందని భారతదేశం తెలిపింది. గత మూడు రాత్రులుగా ఉత్తర భారతదేశంలోని సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపైకి పాకిస్తాన్ డ్రోన్ & క్షిపణి దాడులకు పాల్పడినప్పటికి వాటన్నింటినీ భారత వైమానిక రక్షణ శాఖ విజయవంతంగా అడ్డుకుంది.
సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించడం, సమన్వయం చేయడం వంటి వాటిలో.. డీజీఎంఓల పాత్ర చాలా కీలకం. ఆర్మీలో సీనియర్ అధికారి స్థాయిలో ఉండే వీరు.. సైనిక ఆపరేషన్లలో వ్యూహాత్మక, కార్యాచరణలను అమలు చేస్తుంటారు. ఆర్మీ చీఫ్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంటారు. అంతే కాకుండా ప్రత్యర్థులపై దాడులు, శత్రుమూకలను దీటుగా ఎదుర్కొనే సైనిక ఆపరేషన్లకు సంబంధించిన వ్యూహాలు కూడా రచిస్తుంటారు.
బలగాలను సిద్ధం చేయడం మాత్రమే కాకుండా.. వాటిని రంగంలోకి దించడం వంటి విధులతో పాటు శాంతి పరిరక్షణలోనూ డీజీఎంఓలు కీలకంగా వ్యవహరిస్తారు. ఒకవైపు నిఘా వ్యవస్థలతోనూ సమన్వయం చేసుకుంటూ.. మరోవైపు వ్యూహాలు రచిస్తారు. మనదేశంలో కాల్పుల విరమణ ఒప్పందాలు, సరిహద్దు ఉద్రిక్తతల వేళ కూడా డీజీఎంవోదే ప్రధాన పాత్ర అని చెప్పాల్సిందే. ఎందుకంటే కాల్పుల విరమణకు ముందు మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్ DGMO.. భారత్ DGMOకు ఫోన్ చేసి కాల్పులు విరమణ చేయాలని కోరినట్లు మిస్రీ పేర్కొన్నారు.