
నిషేధిత జాబితాలో పూలు, పండ్లు, కూరగాయలు
బూట్లకు మట్టి ఉన్నా, బ్లూజీన్స్ వేసినా నిషేధమే!
ఫైన్ కట్టాల్సి రావొచ్చు.. కటకటాలపాలూ కావొచ్చు
ఆశ్చర్యం కలిగిస్తున్న విదేశాల్లోని ఇమిగ్రేషన్స్ రూల్స్
డిక్లరేషన్స్ ఇవ్వకుండా.. కొప్పులో మల్లెపూలు పెట్టుకున్నందుకు మెల్‌బోర్న్ విమానాశ్రయ ఇమిగ్రేషన్స్ అధికారులు నవ్య నాయర్ అనే మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈమెకు ఎదురైన చేదు అనుభవం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవును, విదేశాల్లో ఇలాంటి చిత్రవిచిత్రమైన నిషేధాలు చాలా ఉన్నాయి.
ప్రయాణం అంటేనే వెంట తీసుకెళ్లే వస్తువులతో బ్యాగులు నిండాల్సిందే. మౌత్ ఫ్రెషనర్, పెర్ఫ్యూమ్ వంటి రోజూ వాడే వస్తువులు అయినా.. బంధువులు, స్నేహితులకు ఇచ్చే పిండివంటలు, బహుమతులైనా.. బాధ్యత, ప్రేమతో సూట్‌కేస్ బరువెక్కాల్సిందే. మనతోని అట్లుంటది మరి. మన దేశంలో అయితే ఫర్వాలేదు. పరాయి దేశం వెళితేనే సమస్య. ఎందుకంటే మనదగ్గరిలా ఏదిపడితే అది విదేశాలకు తీసుకెళతామంటే అక్కడి నిబంధనలు ఒప్పుకోవు.
ఆస్ట్రేలియాలో ఇటీవలే జరిగిన నటి నవ్య నాయర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో 2002లో జరిగిన సంఘటన సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, హర్భజన్స్ సింగ్ చెరి 200 న్యూజిలాండ్ డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. వాళ్లు బ్యాగుల్లో తీసుకొచ్చిన బూట్లకు మట్టి, గడ్డి ఉండడమే ఇందుకు కారణం. వేడి చేయని పాలను కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు. గ్రీసులోని ప్రాచీన పర్యాటక ప్రదేశాలకు హైహీల్స్‌తో వెళ్లడం నిషిద్ధం. ఇలాంటివి మరికొన్ని..
ఆస్ట్రేలియా: బయో సెక్యూరిటీ, కస్టమ్ చట్టాల ప్రకారం తాజా పూలు, పండ్లు, కూరగాయలు, మట్టిని తీసుకెళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే ఇబ్బడిముబ్బడిగా వీటిని నాటితే అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నది వారి వాదన. సోన్‌పాపిడి, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, మసాలా దినుసులు, పాల ఉత్పత్తులు కూడా నిషేధమే. ఈ జాబితాలో ఇంకా చాలా ఉన్నాయి.
ఆగ్నేయాసియా: ఘాటైన వాసన వచ్చే డ్యూరియన్స్ (పనసలాంటి) పండును ప్రయాణంలో తీసుకెళ్లడాన్ని చాలా విమానయాన సంస్థలు నిషేధించాయి. ముఖ్యంగా కోసిన పండును తీసుకెళ్లరాదు. దీన్ని భారత్‌కు తీసుకురావాలంటే సరైన పద్ధతిలో ప్యాక్ చేయాలి. సింగపూర్‌లో చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతి నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో గమ్స్‌ను ఉమ్మితే భారీ జరిమానా విధిస్తారు. మెడికల్ గమ్స్‌ను మాత్రమే అనుమతిస్తారు.
దక్షిణ కొరియా: అమెరికాకు చెందిన ట్రేడర్ జో కంపెనీ తయారీ ‘ఎవిరీథింగ్ బట్ ది బేగల్ సీజనింగ్’ బ్రాండ్ మసాలాలను విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మసాలాల్లో గసగసాలు ఉండడమే ఇందుకు కారణం. ఆ దేశం గసగసాలను మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తుందట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్‌లలోనూ గసగసాలపై బ్యాన్ ఉంది.
కరేబియన్స్ దీవులు: సైనికులు ధరించే దుస్తుల (క్యామఫ్లాజ్) వంటివి సాధారణ పౌరులు వేసుకోవడం చట్టవిరుద్ధం. సైన్యం మాత్రమే ధరించాలి. సైనికులుగా పొరపడే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణ వ్యక్తులు ఈ దుస్తులతో విమానాశ్రయాల్లో కూడా కనిపించకూడదు. అలా చేస్తే జరిమానా వేస్తారు లేదా జైలుకు పంపుతారు.
యూఎస్: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అమితంగా ఇష్టపడే కిండర్ సర్‌ప్రైజ్ ఎగ్స్ (కిండర్‌జాయ్)ను విమానంలో తీసుకురావడం నిషేధం. గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో తినడానికి వీలుకాని వస్తువులను ఉంచకూడదు.
న్యూజిలాండ్: పచ్చళ్లు, మాంసం, విత్తనాలు, విదేశీ మట్టి నిషేధం. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా సరిహద్దు నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.
ఇటలీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లిప్–ఫ్లాప్స్ లేదా శబ్దం వచ్చే బూట్లు వేసుకోకూడదన్న నిబంధన ఉంది. శబ్దం వస్తే స్థానికులకు చికాకు కలుగుతుందట.
కెనడా: ఈ దేశంలో బేబీ వాకర్ నిషేధం. పిల్లలకు ఇందులో గాయాలవుతున్నాయని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కెనడా వీటిని తమ దేశంలో నిషేధించింది.
ఉత్తర కొరియా : ఎంతో ఇష్టమని ఈ దేశానికి బ్లూజీన్స్‌తో వెళ్లేరు.. ఫైన్ కట్టాలి లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. పాశ్చాత్య సంస్కృతికి ఇవి చిహ్నమని, ఇవి తమ సంస్కృతిని పాడుచేస్తాయని వీటిపై బ్యాన్ విధించారట.