
యుద్ధాల్లో ఇండియాను గెలిపించింది
‘ఎగిరే శవపేటిక’గా అపకీర్తి
‘రష్యన్’ యుద్ధ విమానానికి వీడ్కోలు
వైమానిక దళానికి ఆరు దశాబ్దాల సేవలు
మిగ్-21 యుద్ధ విమానాలు.. ఇవి రష్యన్ ఫైటర్ జెట్స్. ఒకప్పుడు యుద్ధాల్లో భారత్ విజయానికి బాటలు పరిచిన మిగ్స్.. పిట్టల్లా నేల కూలి, ఎందరో పైలట్ల ప్రాణాలు తీసి ‘ఎగిరే శవపేటికలు’ గానూ అపకీర్తి మూటగట్టుకున్నాయి. 60 ఏళ్లపాటు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మిగ్-21 విమానాలు ఇక భారత నేలను ముద్దాడి ఈ మట్టిపైనే శాశ్వత విశ్రాంతి తీసుకోబోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు కల్లా మిగ్-21 యుద్ధ విమానాలను విడతలవారీగా సేవల నుంచి తప్పించాలని, దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ మార్క్-1ఎ’ను వాటి స్థానంలో మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) భావిస్తోంది.
భారత్ వద్ద ప్రస్తుతం 36 మిగ్-21లు ఉన్నాయి. వీటిలో చివరి వేరియంట్ అయిన ‘బైసన్’ను ఇప్పుడు సేవల నుంచి తొలగించనున్నారు. మనకు మిగ్-21 సేవలు 1963లో తొలిసారి ప్రయోగాత్మకంగా మొదలయ్యాయి. అప్పటినుంచి రష్యన్ సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందే వరకు కొన్ని దశాబ్దాల పాటు భారత వైమానిక దళానికి మిగ్-21 వెన్నెముకగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఇటు రక్షణ పరంగానూ, అటు ప్రత్యర్థులపై దాడుల పరంగానూ మన వైమానిక దళానికి గగనతలంలో స్పష్టమైన ఆధిపత్యం కట్టబెట్టింది ఈ యుద్ధ విమానమే.
సోవియట్ కాలంలో తయారీ!
సోవియట్ యూనియన్ హయాంలో మికోయాన్-గురెవిచ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన మిగ్-21 ఫైటర్ జెట్ తొలిసారిగా రెక్కలు విప్పుకుని 70 ఏళ్ల క్రితం 1955లో ఆకాశంలో రివ్వున ఎగిరింది. శక్తిమంతమైన ‘తుమన్ స్కై ఆర్-25’ టర్బోజెట్ ఇంజిన్ సాయంతో ఈ విమానం ధ్వని వేగానికి రెండు రెట్ల పైబడిన వేగం అందుకుంటుంది. ఒకప్పుడు మన దేశంలో 900 దాకా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఉండేవి. వాటిలో 660 విమానాలను నాటి ఒప్పందం మేరకు ఇండియాలోనే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారుచేశారు.
1965, 1971 సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో, 1999లో కార్గిల్ యుద్ధంలో మిగ్-21 తనదైన ముద్ర వేసింది. 2019లో బాలాకోట్ (పాక్)లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన దాడుల్లోనూ కీలక పాత్ర పోషించింది. మిగ్-21లో మూడో తరానికి చెందిన ‘మిగ్-21 బిస్’ను 1976లో మన వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఇక రాడార్, ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థల పరంగా మరింత అధునాతనమైన ‘మిగ్-21 బైసన్’ వేరియంట్ వీటిలో చివరిది.
మిగ్-21 బైసన్.. అరివీర ‘డాగ్ ఫైటర్’!
నరాలు తెగే ఉత్కంఠ పుట్టించేలా రెండు యుద్ధ విమానాలు గగనతలంలో ఊహకందని విన్యాసాలతో అతి సమీపంగా ఒకదానికొకటి భీకరంగా తలపడుతూ రెండో దానిపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తే అది... ‘డాగ్ ఫైట్’! క్షిపణుల వంటి ఆధునిక ఆయుధాలు లేని తొలినాళ్లలో యుద్ధ విమానాలకు మెషీన్ గన్స్ ఉండేవి. శత్రు యుద్ధ విమానాన్ని కూల్చడం కోసం కాల్పులు జరపడానికి రెండో విమానం మొదటి దానికి బాగా దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది.
ఇలా రెండు విమానాలూ మెరుపు వేగంతో పైకీ, కిందికీ కదులుతూ, హఠాత్తుగా మలుపులు తీసుకుంటూ, ఒకదానికి మరొకటి చిక్కకుండా గిరికీలు కొడుతూ హోరాహోరీగా ‘డాగ్ ఫైట్’లో పాల్గొనేవి. మిగ్-21 బైసన్ గొప్ప ‘డాగ్ ఫైటర్. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఆర్-73 క్షిపణులను దానికి అమర్చారు. ఆరితేరిన సుశిక్షిత పైలట్ దొరకాలే గానీ.. ప్రత్యర్థిపై మిగ్-21 బైసన్ వీరోచితంగా విరుచుకుపడుతుందనడంలో కించిత్ అతిశయోక్తి లేదు! 2004లో ‘కోప్ ఇండియా’ పేరిట భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అతి సమీప యుద్ధ విన్యాసాల సందర్భంగా అమెరికన్ ఎఫ్-15 ఫైటర్ జెట్స్ కంటే మిగ్-21 బైసన్ విమానాలు మెరుగ్గా రాణించి ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి.
కూలిన మిగ్స్ 400... 200 మంది పైలట్ల మృతి!
చారిత్రకంగా భారత వైమానిక దళానికి ఎన్ని సేవలందించినా, ఎన్ని విజయాలు సాధించిపెట్టినా, దేశ భౌగోళిక ప్రాంతాన్ని ఎంత గొప్పగా పరిరక్షించినా మిగ్-21లకు ‘ఎగిరే శవపేటికలు’గా, ‘వితంతువుల సృష్టికర్త’ (Widow Maker)గా చెడ్డ పేరు మాత్రం తప్పలేదు. మన దేశంలో గత 60 ఏళ్లలో మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయిన సంఘటనలు 400 దాకా ఉన్నాయి. 200 మందికి పైగా ఐఏఎఫ్ పైలట్లు, 60 మందికి పైగా పౌరులు ఆయా దుర్ఘటనల్లో మరణించారు. ఉద్దేశిత కాలం కంటే సుదీర్ఘ కాలంపాటు ఈ యుద్ధ విమానాలను సర్వీసులో ఉంచడంతో ఇటు భారీగా ప్రాణనష్టం సంభవించగా అటు జెట్స్ నిర్వహణ ఖర్చూ పెరిగిపోయింది.

2023 మే మాసంలో ఓ మిగ్-21 విమానం బహ్లాల్ నగర్ (రాజస్థాన్) వద్ద సాంకేతిక లోపంతో కూలిపోవడంతో ముగ్గురు గ్రామస్థులు మరణించారు. ఆ దుర్ఘటనతో మన వైమానిక దళం మిగ్-21 శ్రేణి విమానాలన్నిటినీ గ్రౌండ్ చేసింది. ఇక వీడ్కోలు యాత్రలో భాగంగా స్క్వాడ్రన్-4కు చెందిన మిగ్-21 బైసన్ విమానం చివరిసారిగా 2023 అక్టోబరులో రాజస్థాన్ పట్టణమైన బార్మర్ గగనవీధుల్లో చక్కర్లు కొట్టింది. యూరప్ ఖండంలో చివరి మిగ్-21 గత ఏడాది క్రొయేషియాలో రిటైరైంది. మరో రెండు నెలల్లో మన దేశంలోనూ మిగ్-21 అధ్యాయం ముగియబోతుంది. మిగ్-29 యుద్ధ విమానాలకు కూడా 2027 నాటికి స్వస్తి పలకాలని ఐఏఎఫ్ భావిస్తోంది.
- జమ్ముల శ్రీకాంత్.