ఐజ్వాల్‌కు చారిత్రక దినం: ప్రధాని మోదీ | Historic day for Aizawl, says PM Modi | Sakshi
Sakshi News home page

ఐజ్వాల్‌కు చారిత్రక దినం: ప్రధాని మోదీ

Sep 13 2025 11:52 AM | Updated on Sep 13 2025 12:03 PM

Historic day for Aizawl, says PM Modi

ఢిల్లీ: మిజోరాం లోని ఐజ్వాల్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐజ్వాల్ కు నేడు చారిత్రక దినం అని, రైల్వే మ్యాప్‌లో మిజోరాంలోని ఐజ్వాల్ కు స్థానం దొరికిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు భారత గ్రోత్ ఇంజన్లు అని మోదీ అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక కారిడార్ లో మిజోరం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు.  ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశానిదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ శనివారం ఉదయం ఐజ్వాల్ చేరుకున్నారు. అయితే భారీ వర్షం కారణంగా లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా ఐజ్వాల్‌లోని లమ్మువల్ గ్రౌండ్‌కు చేరుకోలేకపోయారు. తొలుత ప్రధాని మోదీ 
సైరంగ్-ఆనంద్ విహార్ (ఢిల్లీ) రాజధాని ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి), కోల్‌కతా-సైరాంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి), గౌహతి-సైరాంగ్-గువహతి ఎక్స్‌ప్రెస్ (రోజువారీ) మూడు రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమం అయినా, జాతి నిర్మాణం అయినా, మిజోరాం ప్రజలు ఎల్లప్పుడూ సహకరించడంలో ముందున్నారన్నారు. త్యాగం సేవ, ధైర్యం, కరుణ  ఈ విలువలు మిజో సమాజానికి కేంద్రంగా నిలిచివున్నయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

ఈ రోజు, మిజోరం భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది దేశానికి.. ముఖ్యంగా మిజోరం ప్రజలకు ఒక చారిత్రాత్మక రోజు. నేటి నుండి, ఐజ్వాల్ భారతదేశ రైల్వే పటంలో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం, ఐజ్వాల్ రైల్వే లైన్‌కు పునాది వేసే అవకాశం తనకు లభించిందని ఈ రోజు  దానిని దేశ ప్రజలకు గర్వంగా అంకితం చేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మా ఇంజనీర్ల నైపుణ్యాలు,  మా కార్మికుల స్ఫూర్తి దీనిని సాధ్యం చేశాయని ప్రధాని వారిని కొనియాడారు. ఈ కొత్త రైలు నెట్‌వర్క్ ప్రారంభమైన తర్వాత, మిజోరాంలోని రైతులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్‌లను చేరుకోగలవని, విద్య  ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని ఎంపికలను పొందగలరన్నారు. ఈ నూతన రైల్వే లైను పర్యాటకం, రవాణా,  ఆతిథ్య రంగాలలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement