టీఎంసీ-బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ | Re-Polling Begins In 15 Booths Of South 24 Parganas Amid Allegations Of Irregularities In West Bengal Elections | Sakshi
Sakshi News home page

టీఎంసీ-బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ

May 2 2026 7:15 AM | Updated on May 2 2026 5:46 PM

High Stakes Repolling Grips Bengal Amid

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల నియోజకవర్గంలో 15 బూత్‌లలో రీపోలింగ్ జరుగుతుండగా, టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. సోమవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు ముందు, తృణమూల్ కార్యకర్తలు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లాలోని ఫల్తాలో స్థానికులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

ఇదిలా ఉంచితే,  మధ్యాహ్నం 2 గంటలకు  మగ్రాహత్ పశ్చిమ్‌లో 56.33 శాతం, డైమండ్ హార్బర్‌లో 54.9 శాతం ఓటింగ్ నమోదవ్వగా,  మొత్తం పోలింగ్ శాతం 55.57 శాతంగా ఉంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల రెండో దశలో  అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, సౌత్ 24 పరగణాల జిల్లాలోని 15 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. 

రీ పోలింగ్ సజావుగా సాగుతోందని స్థానిక ఓటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ ఉత్సాహంగా సాగుతున్నప్పటికీ, సాంకేతిక లోపాలు ఓటర్ల సహనానికి పరీక్ష పెట్టాయి. డైమండ్ హార్బర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ గంటకు పైగా నిలిచిపోయింది. దీనితో ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. గత పోలింగ్ రోజున, అలాగే ఈ రోజు కూడా సెలవు పెట్టాల్సి రావడం వల్ల రెండు రోజుల వేతనం కోల్పోయాను అని నిషా మందా అనే మహిళా ఓటరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం, ఈవీఎంలను ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్ చేయడం లాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎన్నికల సంఘం పాత పోలింగ్‌ను రద్దు చేసింది. మగ్రాహట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రత్యేక ఈవీఎంలపై ఉన్న పార్టీ గుర్తులను టేపులతో దాచిపెట్టారనే ఆరోపణలు స్థానిక ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే స్పెషల్ అబ్జర్వర్ల నివేదిక ఆధారంగా, పకడ్బందీ భద్రతా నడుమ శనివారం సాయంత్రం 6 గంటల వరకు మళ్లీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది.

రీపోలింగ్ వ్యవహారం అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రీపోలింగ్ నిర్ణయాన్ని బీజేపీ వర్గాలు స్వాగతిస్తూనే, మరింత ఎక్కువ బూత్‌లలో అక్రమాలు జరిగాయని, వెంటనే అక్కడ కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ నేతలు మాత్రం ఎన్నికల సంఘం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై, పనితీరుపై తీవ్ర అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం చేశారు. ఎలాంటి కనీస పారదర్శకత లేకుండా, తమ పార్టీ ఏజెంట్లకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపించారు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య చెలరేగిన పరస్పర ఆరోపణలతో బెంగాల్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement