
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఉగ్రవాదదేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకంటించారు. రిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీచేశారు.
పాకిస్థాన్‌తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్‌లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హైఅలర్ట్ ప్రకటించింది. ఫైటర్ జెట్స్ ప్రొటోకాల్ నేపథ్యంలో జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్‌లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు.
సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతోపాటు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రాణా ఆఫ్ కట్ వరకు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఎయిర్ పొట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, గంగానగర్, జైసల్మేర్, బర్మేర్‌లో జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేశారు. అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగుల సెలవులను రద్దుచేశారు.