హైకోర్టు ఆదేశాలు: ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి

Helmet For Pillion Riders In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్‌ నియమాలను అధికారులు కఠితరం చేశారు. దీంతో ఇకపై వాహనదారులు హెల్మెట్‌ ధరించకున్నా, ఓవర్‌ స్పీడ్‌తో ముందుకు సాగినా, ఓవర్‌ లోడ్‌తో రోడ్డెక్కినా, సీటు బెల్టు పెట్టుకోకున్నా ఫైన్‌ తప్పదు. ఈ మేరకు సోమవారం నుంచి నిబంధనల్ని కఠినంగా అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ద్విచక్రవాహన దారులకు హెల్మెట్లను తప్పనిసరి చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాహన దారులు తప్పని సరిగా హెల్మెట్‌ వాడే విధంగా పోలీసులు సైతం కఠినంగా తొలినాళ్లలో వ్యవహరించారు. 

అయితే, 75 శాతం మంది హెల్మెట్లు వాడుతున్నా, 25 శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అప్పట్లో నిర్వహించిన సర్వేలో తేలింది. అదే సమయంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్‌ ధరించాల్సిందేనని కోర్టు మరో ఉత్తర్వు ఇవ్వడంతో దానిని అమలు చేయడానికి తీవ్రంగా కుస్తీ పట్టక తప్పలేదు. ఈమేరకు ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా కార్యక్రమాలతో పోలీసులు ముందుకు సాగారు. అయితే ఇదే సమయంలో కరోనా తెర మీదకు రావడంతో హెల్మెట్‌ సోదాలు గాల్లో కలిశాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ హెల్మెట్‌ వాడకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. 

పెరిగిన ప్రమాదాలతో.. 
చెన్నైలో ఈ ఏడాది జనవరి నుంచి మే 15వ తేదీ వర కు వెయ్యికి పైగా ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయి. ఇందులో 98 మంది హెల్మెట్‌ ధరించక పోవడంతో మరణించినట్టు తేలింది. అలాగే, 841 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ప్రమాదాలపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కట్టడికి తగ్గ చర్యలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి రాజధాని నగరం చెన్నై కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల భరతం పట్టనున్నారు.   

ఇద్దరూ ధరించాల్సిందే.. 
బైక్‌లో ఒకరు ప్రయాణించినా.. లేదా ఇద్దరు వెళ్లినా.. తప్పనిసరిగా హెల్మెట్‌ ఉపయోగించాల్సిందే. డ్రైవింగ్‌ చేసే వ్యక్తి హెల్మెట్‌ ధరించి, వెనుక సీట్లో కూర్చున్న వాళ్లు ధరించని పక్షంలో ఇద్దరికి కలిపి జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం చెన్నైలో 300కు పైగా ప్రాంతాల్ని గుర్తించి వాహన తనిఖీలు ముమ్మరం చేయనున్నారు. ఇక, పోలీసులు సైతం తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని లేనిపక్షంలో చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ అయ్యాయి. హెల్మెట్‌ ధరించకుండా తిరిగే వారి భరతం పట్టడమే కాకుండా, సీటు బెల్టు వాడని వారు, అతి వేగంగా వాహనాల్ని నడిపే వారితో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.   

ఇది కూడా చదవండి: హెల్మెట్‌ రూల్స్‌ ఇకపై మరింత కఠినతరం‌.. అలా చేసినా జరిమానే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top