ముంబైని వీడని వర్షాలు

Heavy Rains In Mumbai forecast Another Five Days - Sakshi

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీరు

మరో ఐదు రోజులు వర్ష సూచన

ముంబై సెంట్రల్‌: ముంబైలో సోమవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, రోడ్డు రవాణతోపాటు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. నగరంలోని లోత ట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చొరబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హింద్‌మాతా, పరేల్, బైకుల్లా ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.

బాండూప్‌ వాటర్‌ ఫిల్టర్‌ ప్లాంట్‌లో వాన నీరు చొచ్చుకు రావడంతో ముంబై లో పలు ప్రాంతాల్లో సోమవారం నీటి సరఫరా నిలిచిపోయింది.  యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి రాత్రి వరకు నీటి సరఫరా మళ్లీ పునరుద్దరించినప్పటికీ నల్లాల్లో మురికినీరు రావడంతో, తాగు నీటిని బాగా మరిగించి తాగాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు మురికినీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

భీవండీలో కుంభవృష్టి.. : నిరంతరం కురుస్తున్న కుంభవృష్టి వల్ల భీవండీ నగరం లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈద్‌గాహ్, ఖాడీపార్, కారీవలి, ప్రధాన మార్కెట్‌ ప్రాంతం, తీన్‌ బత్తీ, బాజీ మార్కెట్‌ ప్రాంతాలలో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తున నీరు నిలిచిపోయింది. షాపులు, నివాస స్థలాల్లోకి వరద నీ రు దూసుకొని వచ్చింది. పలు ప్రాంతాల్లో అధికారులు జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరో 5 రోజుల పాటు భారీవర్ష సూచన.. 
ముంబైలో  రాబోయే మరో 5 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, కొంకణ్‌ ప్రాంతంలో, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

మరాఠ్వాడా, విదర్భలోని పలు ప్రాంతాల్లో యెల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. రానున్న 48 గంటల్లో ముంబై, పరిసర నగరాల్లో కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాందివలిలో భారీ వర్షాలతో ఘటన 
సాక్షి ముంబై: కాందివలిలోని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పార్కింగ్‌లో సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి. కాందివలిలోని ఠాకూర్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబైలో శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే.

ఇలాంటి నేపథ్యంలో ఠాకూర్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలోని బీఎంసీ పార్కింగులో రోజు మాదిరిగానే అనేక మంది వాహనాలను పార్కింగ్‌ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా పార్కింగులో పెద్ద ఎత్తున నీరు చొరబడింది.  దీంతో అక్కడ పార్కింగ్‌ చేసిన సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top