మహారాష్ట్రలో జల ప్రళయం

Heavy rains cause floods in parts of Maharashtra - Sakshi

48 గంటల్లో 129 మంది మృత్యువాత

తుడిచిపెట్టుకుపోయిన తలియే గ్రామం

మరింత పెరిగే అవకాశం

కొనసాగుతున్న రక్షణ, సహాయక చర్యలు

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలతో జల ప్రళయం సంభవించింది. గడిచిన 48 గంటల్లో మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వర్షం సంబంధిత ఘటనల్లో 129 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. కొండచరియలు విరిగిపడి రాయ్‌గఢ్‌ జిల్లాలో తలియే గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటి వరకు 38 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకునిపోయారు. సతారా జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 27 మంది చనిపోయారు.

గోండియా, చంద్రాపూర్‌ జిల్లాల్లోనూ పలువురు మృత్యువాతపడ్డారు. రత్నగిరి జిల్లాలో 10 మంది, సతారా జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో 11 మంది, ముంబైలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా చిప్లూన్‌ పట్టణం పూర్తిగా జలమయమైంది. ఇళ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, వీధులలో 4 నుంచి 14 అడుగుల మేర నిలిచింది. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. స్థానిక ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. దీంతో, కోవిడ్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌లపై ఉన్న 8 మంది మృతి చెందారు. 

వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని రక్షించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు నేవీ ఇతర సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల సాయంతో యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కొంకణ్‌లోని ముంబై, థానే, రాయ్‌గఢ్, రత్నగిరి, పాల్ఘర్, పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్,  సతారా, సాంగ్లీ, మరాఠ్వాడాలోని పర్భణీ, నాందేడ్, విదర్భలోని అకోలా జిల్లాల్లో  మూడు, నాలుగు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది.

బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లోని నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో నివాసాలు 15 అడుగుల మేర వరదలో నీట మునిగాయి. వందలాది గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కొంత విశ్రాంతి ఇవ్వడం, వరద తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్లో కొంత వేగం పెరిగింది. 

మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మరణించిన వారి పట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశా రు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం అందించనున్ననట్లు తెలిపారు.   

తలియే గ్రామం జల సమాధి!
రాయ్‌గఢ్‌ జిల్లా తలియే గ్రామం జల సమాధి అయింది. ఈ గ్రామంపై కొండచరియలు విరిగిపడడంతో మొత్తం 35 ఇళ్లలోని వారు సజీవ సమా ది అయ్యారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాల మేరకు 38 మృతదేహాలను బయటికి తీయగలిగారు. శిథిలాల కింద మరో 36 మందికిపైగా ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతోపాటు కలకలాన్ని రేకెత్తించింది. గురువారం సాయం త్రం 4.30 గంటల ప్రాంతంలో తలియే గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ కింద ఉన్న  ఈ గ్రామంలో సుమారు 35 ఇళ్లుండేవి. వరదలతో ఈ గ్రామమే కనపడకుండాపోయింది. తలి యే గ్రామం కన్పించకుండా మట్టిదిబ్బలు, బురదమయంగా మారింది. కొండప్రాం తంలో ఈ గ్రామం ఉండడం, రోడ్లు జలమయం కావడం, కుంగిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top