
పంచమహల్: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కార్గో రోప్‌వే కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఆరుగురు మృతిచెందారు. ఆధ్యాత్మిక కేంద్రం పావగఢ్ కొండపైకి రోప్‌వేలో నిర్మాణ సామగ్రి తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కార్గో రోప్‌వే ట్రాలీ, కొండపైకి నిర్మాణ సామాగ్రిని తరలిస్తున్న క్రమంలో నాలుగో టవర్ నుండి కేబుల్స్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో మరణించిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, ఇద్దరు కశ్మీర్, ఒకరు రాజస్థాన్‌కు చెందినవారిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రికులను తీసుకెళ్లే ప్యాసింజర్ రోప్‌వే మూసివేశామని.. అయితే నిర్మాణ పనుల కోసం గూడ్స్ రోప్‌వే మాత్రం వినియోగంలో ఉందని పోలీసులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళం, జిల్లా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ట్రాలీ దాని సామర్థ్యానికి మించి సామాగ్రిని తీసుకెళ్ళిందా?, సాధారణ తనిఖీలలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 1986లో ఈ రోప్‌వేను నిర్మించారు.