డిజిటల్‌ 'డోపీ'లు | The growing digital dopamine problem among youth | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ 'డోపీ'లు

Sep 14 2025 5:00 AM | Updated on Sep 14 2025 5:00 AM

The growing digital dopamine problem among youth

యువతలో పెరిగిపోతున్న డిజిటల్‌ డోపమిన్‌ సమస్య 

సోషల్‌ మీడియాలో లైక్‌లు, కామెంట్ల కోసం ఎదురుచూపులు.. లైకులొస్తే సంతోషం.. రాకపోతే చిరాకు, కోపం, నిరాశ 

సంతోషాన్నిచ్చే హార్మోన్‌తో సమస్యలు సృష్టిస్తున్న సోషల్‌ మీడియా

నేటి యువత ‘డిజిటల్‌ సంతోషాల్లో’ తేలియాడుతోంది. 

ఎంతగా అంటే.. తాము సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించే యువత సమయాన్ని వృథా చేసుకోవటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటోంది. అందులో తాజాగా ‘డిజిటల్‌ డోపమిన్‌’వచ్చి చేరింది. – సాక్షి, హైదరాబాద్‌

ఏమిటీ డోపమిన్‌? 
డోపమిన్‌ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్‌. దీనిని ‘సంతోష హార్మోన్‌’అని పిలుస్తారు. ఇది మన మెదడు బహుమతి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. రుచికరమైన ఆహారం తినడం, ప్రశంసలు స్వీకరించడం, లక్ష్యాన్ని సాధించడం వంటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు ఈ హార్మోన్‌ విడుదలవుతుంది. ఈ న్యూరోట్రాన్స్‌మీటర్‌ మెదడుకు కార్యాచరణ ఫలవంతమైందని సంకేతమిస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. 

ఇప్పుడు సమస్య ఏంటి? 
మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు విడుదలై మనల్ని మరింత ప్రోత్సహించే ఈ డోపమిన్‌ హార్మోనే ఇప్పుడు సోషల్‌ మీడియాను నడిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టు లు, వీడియోలకు లైకులు, షేర్‌లు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అప్పుడు మన మెదడులో ఈ డోపమిన్‌ హార్మో న్‌ విడుదలవుతుంది. 

అయితే, అది ఇప్పుడు శ్రుతిమించింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, షేర్‌ల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేలా ఈ హార్మోన్‌ ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల యువత నిత్యం సోషల్‌మీడియా యాప్‌లను అంటిపెట్టుకొని ఉంటున్నారని అంటున్నారు. అలా మన మెదడు ఈ తక్షణ బహుమతులను కోరుకునేలా కండిషన్‌కు గురవుతుంది. ఇది స్వల్పకాలిక ఆనందం ఇచ్చినా.. తరువాత దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొంటున్నారు.  

డిజిటల్‌ డోపమిన్‌ సంకేతాలు
» సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నోటిఫికేషన్లను తనిఖీ చేయడం 
» సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్‌గా లేనప్పుడు ఆందోళన చెందడం
» సమయం తెలియకుండా సోషల్‌ మీడియాలో స్క్రోలింగ్‌ చేస్తూ ఉండిపోవటం
»  ఒకరి జీవితాన్ని ఇతరుల హైలైట్‌ రీల్స్‌తో పోల్చడం 
»  ప్రతికూల కంటెంట్‌తో మానసిక స్థితిలో మార్పులు రావడం డోపమిన్‌ విరమణ (క్రాష్‌) తర్వాత భావోద్వేగ ప్రతిస్పందనలు.. 
»  డోపమిన్‌ హార్మోన్‌ ప్రభావం తొలగిపోయి మెదడు సాధారణ స్థితికి రావటాన్ని డోపమిన్‌ క్రాష్‌ అంటారు. 
» ఈ స్థితిలో విసుగు, అశాంతి కలుగుతాయి. 
» చిరాకు, నిరాశ, ౖఅపరాధ భావన, సిగ్గు, నిస్పృహ ఆవరించడం, ఆందోళనకు గురవుతారు. 
»ఉదాహరణకు ఓటీటీలో ఒక వెబ్‌సిరీస్‌ను గంటల తరబడి చూసిన తర్వాత సమయం అంతా వృథా అయ్యిందని బాధపడటం. 
» డోపమిన్‌ వ్యసనానికి అతిపెద్ద కారణాలలో సోషల్‌ మీడియా ఒకటి. ఇన్‌స్ట్రాగామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్‌ వంటి వాటిని వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ప్రతి లైక్, కామెంట్, షేర్‌ చిన్నస్థాయిలో డోపమిన్‌ విడుదలను ప్రేరేపిస్తాయి. ఏదో సాధించామనే భావనను కలిగిస్తాయి. ఈ వర్చువల్‌ బహుమతులను ఎంత ఎక్కువగా వెంబడిస్తే, నిజ జీవిత అనుభవాలతో మనం అంతగా అసంతృప్తి చెందాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  
»  ఇది మన జీవితంలోని ఇతర అంశాలైన అతిగా తినడం, ఇంపల్స్‌ షాపింగ్, మితిమీరిన గేమింగ్‌ వంటి వాటికి కూడా విస్తరించింది.  
» డిజిటల్‌ డోపమిన్‌ సమస్య ఇప్పటికే అమెరికన్లలో తీవ్రంగా ఉంది. భారత్‌లోని సోషల్, డిజిటల్‌ మీడి యా వినియోగదారులు సైతం దీనికి ఎక్కువగానే ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

‘డిజిటల్‌’ వాడకం తగ్గించుకోవటమే మార్గం 
డ్రగ్స్, ఆల్కహాల్‌ వంటివి తీసుకున్నపుడు వచ్చే ప్రభావం మాదిరిగా ‘డిజిటల్‌ డోపమిన్‌’ప్రభావితం చేస్తోంది. మెదడు రివార్డ్స్‌ సిస్టమ్‌లో భాగంగా క్విక్‌ గ్రాటిఫికేషన్‌ను కోరుకుంటోంది. మెదడులోని సహజ రివార్డ్‌ సర్క్యూట్‌ను సోషల్‌మీడియా అధిక వినియోగం హైజాక్‌ చేసి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. 

పుస్తకాలు చదివే అభిరుచి, రోజువారీ వ్యాయామం వంటివాటికి దూరం చేస్తోంది. స్వీయ నియంత్రణ తగ్గిపోవడం, ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం నిత్యకృత్యమవుతున్నాయి. దీనిని అధిగమించాలంటే మొబైల్స్, ఇతర డిజిటల్‌ సాధనాల వినియోగ సమయాన్ని కచ్చితంగా తగ్గించుకోవాలి.   – డా. నిషాంత్‌ వేమన, కన్సల్టింగ్‌ సైకియాట్రిస్ట్‌.

సామాజిక మాధ్యమాలు నిత్యావసరాలు కాకపోయినా.. అవే సర్వస్వం, అవి లేకపోతే అంతా శూన్యం అన్నట్టుగా యువత ప్రవరిస్తుండడం ఆందోళనకరం. వ్యాయామ విద్య, క్రీడలు, కళలు వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. 

ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల అతి వినియోగాన్ని అదుపుచేసే చర్యలు తీసుకోకపోతే దేశం అనేక దుర్గుణాలకు, మానసిక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతుంది. వ్యాయామం, శారీరక శ్రమ తగ్గిపోయి ఇప్పటికే డయాబెటిస్, ఒబేసిటీ వంటివి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిజిటల్‌ డోపమిన్‌ మనిషి ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.  – సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement