గుడ్‌న్యూస్‌.. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్ | Government Approves Additional 20% Commercial LPG Allocation to States | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌.. రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

Mar 21 2026 7:40 PM | Updated on Mar 21 2026 8:28 PM

Government Approves Additional 20% Commercial LPG Allocation to States

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్‌ కొరత నెలకొన్న వేళ రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20 శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు తెలిపారు.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23 నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 10 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను పెంచింది కేంద్రం. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

హోటల్స్, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. పారిశ్రామిక క్యాంటీన్లు, ఆహార ప్రాసెసింగ్/పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపే రాయితీ క్యాంటీన్లు/అవుట్‌లెట్లు, కమ్యూనిటీ కిచెన్‌లకు సరఫరా చూడాలని లేఖలో పేర్కొంది.

మరోవైపు.. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ నౌకల కదలికలు, పోర్టు కార్యకలాపాలు, భారతీయ సముద్ర కార్మికుల భద్రత, సముద్ర వాణిజ్య కొనసాగింపును నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ సముద్ర కార్మికులు అందరూ సురక్షితంగా ఉన్నారని, గత 24 గంటల్లో భారత జెండా ఉన్న నౌకలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదని తెలిపింది. మొత్తం 22 భారత నౌకలు, 611 భారతీయ సముద్ర కార్మికులు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారని, డీజీ షిప్పింగ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement