విజయ్‌.. ఇలాంటివి చేయకండి: గాంధీజీ మునిమనవడు | Gopalkrishna Gandhi on tvk vijay win An open letter | Sakshi
Sakshi News home page

విజయ్‌.. ఇలాంటివి చేయకండి: గాంధీజీ మునిమనవడు

May 6 2026 6:57 PM | Updated on May 6 2026 7:18 PM

Gopalkrishna Gandhi on tvk vijay win An open letter

చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అధినేత జోసెఫ్ విజయ్‌కు మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత గోపాలకృష్ణ గాంధీ బహిరంగ లేఖ రూపంలో వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. కొన్ని పనలు చేయాలని, కొన్నింటిని చేయకూడదని సూచించారు.

‘కాబోయే ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. తమిళనాడు ముఖ్యమంత్రిగా మీ పర్యాయం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. నేను రాష్ట్ర ఓటరును. కానీ, ఏప్రిల్ 23 రోజు మీకు ఓటు వేసిన దాదాపు 35 శాతం మందిలో నేను లేను. మీకు ఓటు వేయని 65 శాతం మందిలో నేనున్నాను. విజయ్ యువతను ఆకర్షిస్తున్నారని, కానీ అది సీట్లు తెచ్చిపెట్టదని అనుకున్నాను. ఓట్లు ఎప్పటిలాగే వెళ్లే చోటికే వెళ్తాయనే అభిప్రాయంతో నేను ఉన్నాను. కాబట్టి 4 మే రోజు ఫలితాలు వరుసగా వెలువడుతుండగా నాకు ఆశ్చర్యం కలిగింది. అదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. విజయ్‌ కొత్తవాడు, అంటే అనుభవం తక్కువ’ అన్నారు.

ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థను రక్షించాలి 
అదే సమయంలో ఆయన అవినీతిపరుల ప్రభావం లేకుండా ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాల క్రితం కొత్తగా ఎన్నికైన ఎం.కె.స్టాలిన్ ముందు కొన్ని ఆలోచనలను ఉంచినట్లే, ఇప్పుడు మీ ముందూ అటువంటి వాటిని ఉంచాలనుకుంటున్నానని చెప్పారు. ‘మీరు ఎన్నికల్లో గెలిచారు. సభలో అత్యంత కీలకమైన ఫ్లోర్ టెస్ట్ ఇంకా గెలవాల్సి ఉంది. భారత ఫెడరల్, సెక్యులర్ వ్యవస్థ రక్షణను మొదటి ప్రాధాన్యంగా ఉంచాలి. మీ నాయకత్వంలో రాష్ట్రం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ గౌరవాన్ని నిలబెట్టాలి. పదవి కాపాడుకోవాలనే ఆందోళన దానిపై రాజీ పడేలా చేయకూడదు. మీ సిద్ధాంతం ఏమిటి అని అడగవచ్చు. అది మిమ్మల్ని కలవరపెట్టకూడదు. ‘నా సిద్ధాంతం.. సిద్ధాంతం లేదు’ అని చెప్పండి. అలాగే ‘నా మనసాక్షిని అనుసరించడం’ అని అనండి.

మీరు కొత్త నాయకుడు. గత భారాలు లేకుండా కొత్తగా పాలనను ప్రారంభించే అవకాశం ఉంది. ఎం.కె.స్టాలిన్ వద్ద ఈ అవకాశం లేదు. అలాగే, ఆయనకు ఉండి మీకు లేనిది అనుభవం. ఆయన మీకు ముందున్న నాయకుడు, శత్రువు కాదు. మీరు ఆయన తరువాతి నాయకుడు, స్థానభ్రంశం చేసే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలపై విభేదాలు ఉన్నా, ఫెడరల్ స్వభావం, సెక్యులర్ సమానత్వం విషయంలో మీరు ఇద్దరూ ఒకే దిశలో ఉన్నారు. ఆ దిశలో ఆయన మాట వినండి’ అని చెప్పారు.

ఉదయనిధితో పోటీ పడొద్దు 
‘సభలో ఉదయనిధి స్టాలిన్ ఉనికి మీకు పోటీ కాకుండా మంచి జంటగా ఉండాలి. మీరు ఇద్దరూ యువకులు, ఆకర్షించే స్వభావం ఉన్నవారు. మీ 108 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి మాత్రమే ఇంతకుముందు శాసనసభలో అనుభవం ఉంది. మిగతావారు ఆ ముగ్గురి దగ్గర నుంచి, ఎదుటి సీనియర్ సభ్యుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కొత్త సభలో కేవలం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు కర్మయోగి పెరుంతలైవర్ కామరాజ్ నేతృత్వం వహించిన పార్టీకి చెందినవారని గుర్తుంచుకోండి. సెక్రటేరియట్‌లో అధికారులను మీ సహచరులుగా చూడండి, కిందివారిగా కాదు.

చివరిగా, తమిళనాడులో మంచి, స్వచ్ఛమైన, సమర్థ పాలన కొనసాగించండి. పర్యావరణ రక్షణను ప్రధాన ప్రాధాన్యంగా ఉంచండి. రాష్ట్రం దాటి ద్వేషం లేని, భయం లేని, న్యాయమైన భారతానికి మార్గదర్శకంగా నిలవండి. ఒక వ్యక్తిగత వ్యాఖ్యతో ముగిస్తాను.. ఈ రాష్ట్రంలో ఒక క్రైస్తవుడు ప్రభుత్వం నడిపించడం ఇదే మొదటిసారి. ఆ విధిని తమిళనాడు సెక్యులర్ గుర్తింపుకు దైవ హస్తంగా భావించండి’ అని గోపాలకృష్ణ గాంధీ రాసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement