
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుగా ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) ద్వారా గడిచిన రెండేళ్ల కాలంలో కనీసం టన్ను బరువైన రూ.800 కోట్ల బంగారంలో దేశంలోకి దొంగచాటుగా వచ్చింది. 2023, 2024 సంవత్సరాల్లో టిబెటన్లు, చైనీయులే ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారు. గతేడాది జూలైలో లద్దాఖ్‌లో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) దళం 108 కిలోల విదేశీ బంగారం కడ్డీలను పట్టుకున్న నేపథ్యంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినట్లు మంగళవారం ఈడీ వర్గాలు తెలిపాయి.
చైనాతో మనకున్న 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్‌ఏసీ రక్షణ బాధ్యతలను ఐటీబీపీయే చూసుకుంటుంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఐదు ప్రాంతాలు, లద్దాఖ్‌లో ఒక చోట మంగళవారం తనిఖీలు చేపట్టామని ఈడీ వివరించింది. దొంగతనంగా తీసుకువచ్చిన బంగారానికి సంబంధించిన చెల్లింపులన్నీ క్రిప్టోకరెన్సీ ద్వారానే పూర్తయినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) తెలిపింది. పట్టుబడిన 108 కిలోల విదేశీ బంగారాన్ని చైనాకు చెందిన భు చుమ్‌చుమ్ అనే వ్యక్తి భారత్‌లోని టెండు తాషికి ఎల్‌ఏసీ ద్వారా పంపాడని డీఆర్‌ఐ వివరించింది. ఇందుకు సంబంధించి 10 మందిని అదుపులోకి తీసుకున్నామంది.