
గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్ ప్రాజెక్టు’లో అత్యంత కీలకమైన ‘క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ టెస్ట్’విజయవంతమైంది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తిరిగి భూమిని చేరే సమయంలో వారు ప్రయాణించే మాడ్యూల్‌ను సురక్షితంగా నేలకు దింపటంలో నైపుణ్యాన్ని సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహించారు. ఇస్రో, డీఆర్డీఓ, ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌గార్డ్ ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా డమ్మీ మాడ్యూల్‌ను ఆదివారం భూమికి 35 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి జారవిడిచారు.
అది భూ ఉపరితలానికి మూడు కిలోమీటర్ల సమీపానికి చేరుకోగానే అందులోని పారాచ్యూట్ తెరుచుకుంది. దీంతో మాడ్యూల్ వేగం నిర్దేశిత స్థాయికి నియంత్రించబడి బంగాళాఖాతంలో సురక్షితంగా దిగింది. దానిని కోస్ట్‌గార్డ్ సిబ్బంది మెషీన్ బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చింది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ–01)గా పిలుస్తున్న ఈ ప్రయోగం ఇస్రోకు మొదటిది. గగన్‌యాన్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి జీ–1 పేరుతో ప్రయోగాత్మక పరీక్షకు ఇస్రో సిద్ధమవుతోంది. 2035 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావాలని నిర్ణయించింది.
అంతరిక్షంలో భారతీయ స్పేస్ స్టేషన్ (బీఎస్‌ఎస్) నిర్మాణానికి ఇప్పటికే స్పేడెక్స్ ఉపగ్రహాలను ప్రయోగించి డాకింగ్, అన్ డాకింగ్ ప్రక్రియలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈలోపు గగన్‌యాన్‌కి సంబం«ధించి పలు పరీక్షలు చేపట్టనున్నారు. అందులో భాగంగానే శ్రీహరికోటలోని షార్ నుంచి తాజాగా క్రూ మాడ్యూల్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ నిర్వహించారు. ఈ ప్రయోగం క్రూ మాడ్యూల్‌లోని వివిధ పరికరాలు, ప్యారాచూట్ సమర్థత, పనితీరుతోపాటు వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడానికి కావాల్సిన పరిస్థితుల అధ్యయనానికి దోహదపడుతుందని ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది.