
తక్కువ చక్కెర, చక్కెర లేని డ్రింక్స్‌కు భారీ డిమాండ్
5 ఏళ్లలో చక్కెర రహిత పానీయాలు 142% అధికం
కొనుగోళ్లను నడిపిస్తున్న పెద్ద నగరాల యూత్
కోవిడ్ తర్వాత వీటి వినియోగంలో గుర్తించదగిన మార్పు
చక్కెర లేని పానీయాల వినియోగం భారత్‌లో క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రధానంగా పట్టణాలూ, నగరాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. గత 5 ఏళ్ల కాలంలో.. భారతీయ నాన్–ఆల్కహాల్ పానీయాల బ్రాండ్లు తక్కువ చక్కెర లేదా చక్కెర లేని డ్రింక్స్‌ను ఎక్కువగా ప్రవేశపెట్టాయి. కేవలం మూడు నెలల్లోనే కోకా–కోలా తయారీ ‘షుగర్ ఫ్రీ థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్’ అమ్మకాలు రికార్డు స్థాయిలో 25 లక్షల యూనిట్ కేసులు నమోదుకావడమే ఇందుకు ఒక ఉదాహరణ.
ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ ‘మింటెల్ గ్రూప్’ రూపొందించిన గ్లోబల్ న్యూ ప్రొడక్ట్స్ గణాంకాల ప్రకారం 2019 జూలై– 2024 జూన్ మధ్య కాలంలో భారతీయ నాన్–ఆల్కహాల్ పానీయాల బ్రాండ్లు తక్కువ చక్కెర లేదా చక్కెర లేని డ్రింక్స్‌ను ఎక్కువగా ప్రవేశపెట్టాయి. దేశంలో తక్కువ చక్కెర, తగ్గించిన చక్కెర పేరుతో విడుదల చేసిన ఉత్పత్తుల సంఖ్య 5 ఏళ్లలో 483% పెరిగింది. చక్కెర రహిత ఉత్పత్తులు 142% అధికం అయ్యాయి. 2024లో అత్యధికంగా సుమారు రూ.750 కోట్ల పానీయాల అమ్మకాలు జరిగాయి. 2023తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని వినియోగదారులు ఈ జోరును నడిపిస్తున్నారు. ‘చిన్న వయసు వారిలో కూడా ఊబకాయం, మధుమేహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శారీరక ఆరోగ్య స్పృహ పెరుగుతోంది’ అని మింటెల్ ఇండియా ఫుడ్, డ్రింక్ సీనియర్ అనలిస్ట్ అనామిక బెనర్జీ అన్నారు.
జీరో షుగర్
ప్రపంచంలోనే అతిపెద్ద పానీయాల కంపెనీ అయిన కోకా–కోలాతోపాటు సమీప ప్రత్యర్థి పెప్సికో, అలాగే రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్.. కేలరీలను లెక్కించే కస్టమర్ల కోసం జీరో–షుగర్ వేరియంట్స్‌ను ఆఫర్ ఉన్నాయి. డైట్, కేలరీలు లేని వేరియంట్స్ అయిన కోక్ జీరో, డైట్ కోక్, స్ప్రైట్ జీరో, థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్ వంటి వాటికి భారత్‌లో డిమాండ్ దూసుకెళుతోందని కోకా–కోలా తెలిపింది. ప్రధానంగా యువతలో వీటి వినియోగం ఎక్కువని వివరించింది. మారుతున్న జీవనశైలి, అందుబాటులో విభిన్న ఉత్పత్తులు ఉండడం ఈ వృద్ధిని నడిపిస్తోందని తెలిపింది.
ప్రస్తుతానికి నగరాలూ పట్టణాల్లోనే..
ఎలక్ట్రోలైట్స్‌తో కూడిన పానీయం బాడీఆర్మర్ లైట్, స్పోర్ట్స్ డ్రింక్ ఛార్జ్‌డ్‌తోపాటు హానెస్ట్ టీ ఉత్పత్తులను ఇటీవలే కోకా–కోలా అందుబాటులోకి తెచి్చంది. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘కాంటార్’ అధ్యయనం ప్రకారం చక్కెర లేని పానీయాలను వినియోగించే భారతీయ కుటుంబాల సంఖ్య నాలుగేళ్లలో 78% పెరిగింది. అయితే ఈ ఉత్పత్తులు ఇప్పటికీ నగరాలు, పెద్ద పట్టణాలకే పరిమితమయ్యాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుందని ‘కాంటార్’ వరల్డ్ ప్యానెల్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ (దక్షిణాసియా) కె.రామకష్ణన్ అన్నారు.
మహమ్మారి తర్వాత..
పెప్సికో పానీయాల విక్రయాల్లో గత ఏడాది సెవెనప్, పెప్సి, గాటోరేడ్ వంటి బ్రాండ్ల తక్కువ–చక్కెర, చక్కెర లేని విభాగం ఉత్పత్తుల వాటా పరిమాణం పరంగా 44% ఉంది. ఆఫ్రికా, నేపాల్, శ్రీలంకతో కలిపి.. తక్కువ–చక్కెర, చక్కెర లేని ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ మొత్తం పరిమాణంలో 53% వాటాను కలిగి ఉన్నాయని భారత్‌లో పెప్సికో ఉత్పత్తులను తయారు చేస్తున్న వరుణ్ బెవరేజెస్ తెలిపింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో తక్కువ–కేలరీ, జీరో–షుగర్ ఉత్పత్తులు 50% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. చక్కెర రహిత, తక్కువ చక్కెర పానీయాల పట్ల వినియోగదారులకు కొంత ఆసక్తి ఉన్నప్పటికీ.. కోవిడ్–19 మహమ్మారి తర్వాత వీటి వినియోగంలో గుర్తించదగిన మార్పు వచ్చిందని వివరించారు. ‘కోవిడ్ సమయంలో ఇంటి భోజనానికి, శారీరక శ్రమకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో షుగర్ ఫ్రీ ఆధారిత ఉత్పత్తుల తయారీకి మొగ్గు చూపేలా చేసింది’ అని తెలిపారు.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరిమితులు..
చక్కెర శాతం, కేలరీల సంఖ్య, ఉపయోగించే స్వీటెనర్ రకాన్ని బట్టి సాధారణ, ఆరోగ్యకర పానీయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇటీవలి కాలంలో కృత్రిమ స్వీటెనర్ల వాడకం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వీటి ప్రభావం భారతీయులపై ఏ మేరకు ఉందో పరిశీలిస్తామని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తెలిపింది. స్టీవియా, ఎసిసల్ఫేమ్ పొటా షియం, అస్పాటేమ్, సుక్రలోజ్ వంటి నాన్–కెలోరిక్ స్వీటెనర్ల వాడకానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ భద్రతా పరిమితులను కూడా నిర్దేశించింది.