breaking news
health activists
-
తీపి వద్దు.. సున్నా ముద్దు.. ఈ డ్రింక్స్‌కు భారీ డిమాండ్
చక్కెర లేని పానీయాల వినియోగం భారత్‌లో క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రధానంగా పట్టణాలూ, నగరాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. గత 5 ఏళ్ల కాలంలో.. భారతీయ నాన్–ఆల్కహాల్ పానీయాల బ్రాండ్లు తక్కువ చక్కెర లేదా చక్కెర లేని డ్రింక్స్‌ను ఎక్కువగా ప్రవేశపెట్టాయి. కేవలం మూడు నెలల్లోనే కోకా–కోలా తయారీ ‘షుగర్ ఫ్రీ థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్’ అమ్మకాలు రికార్డు స్థాయిలో 25 లక్షల యూనిట్ కేసులు నమోదుకావడమే ఇందుకు ఒక ఉదాహరణ.ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ ‘మింటెల్ గ్రూప్’ రూపొందించిన గ్లోబల్ న్యూ ప్రొడక్ట్స్ గణాంకాల ప్రకారం 2019 జూలై– 2024 జూన్ మధ్య కాలంలో భారతీయ నాన్–ఆల్కహాల్ పానీయాల బ్రాండ్లు తక్కువ చక్కెర లేదా చక్కెర లేని డ్రింక్స్‌ను ఎక్కువగా ప్రవేశపెట్టాయి. దేశంలో తక్కువ చక్కెర, తగ్గించిన చక్కెర పేరుతో విడుదల చేసిన ఉత్పత్తుల సంఖ్య 5 ఏళ్లలో 483% పెరిగింది. చక్కెర రహిత ఉత్పత్తులు 142% అధికం అయ్యాయి. 2024లో అత్యధికంగా సుమారు రూ.750 కోట్ల పానీయాల అమ్మకాలు జరిగాయి. 2023తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని వినియోగదారులు ఈ జోరును నడిపిస్తున్నారు. ‘చిన్న వయసు వారిలో కూడా ఊబకాయం, మధుమేహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శారీరక ఆరోగ్య స్పృహ పెరుగుతోంది’ అని మింటెల్ ఇండియా ఫుడ్, డ్రింక్ సీనియర్ అనలిస్ట్ అనామిక బెనర్జీ అన్నారు.జీరో షుగర్ప్రపంచంలోనే అతిపెద్ద పానీయాల కంపెనీ అయిన కోకా–కోలాతోపాటు సమీప ప్రత్యర్థి పెప్సికో, అలాగే రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్.. కేలరీలను లెక్కించే కస్టమర్ల కోసం జీరో–షుగర్ వేరియంట్స్‌ను ఆఫర్ ఉన్నాయి. డైట్, కేలరీలు లేని వేరియంట్స్ అయిన కోక్ జీరో, డైట్ కోక్, స్ప్రైట్ జీరో, థమ్స్ అప్ ఎక్స్‌ఫోర్స్ వంటి వాటికి భారత్‌లో డిమాండ్ దూసుకెళుతోందని కోకా–కోలా తెలిపింది. ప్రధానంగా యువతలో వీటి వినియోగం ఎక్కువని వివరించింది. మారుతున్న జీవనశైలి, అందుబాటులో విభిన్న ఉత్పత్తులు ఉండడం ఈ వృద్ధిని నడిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతానికి నగరాలూ పట్టణాల్లోనే.. ఎలక్ట్రోలైట్స్తో కూడిన పానీయం బాడీఆర్మర్ లైట్, స్పోర్ట్స్ డ్రింక్ ఛార్జ్డ్తోపాటు హానెస్ట్ టీ ఉత్పత్తులను ఇటీవలే కోకా–కోలా అందుబాటులోకి తెచి్చంది. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘కాంటార్’ అధ్యయనం ప్రకారం చక్కెర లేని పానీయాలను వినియోగించే భారతీయ కుటుంబాల సంఖ్య నాలుగేళ్లలో 78% పెరిగింది. అయితే ఈ ఉత్పత్తులు ఇప్పటికీ నగరాలు, పెద్ద పట్టణాలకే పరిమితమయ్యాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుందని ‘కాంటార్’ వరల్డ్ ప్యానెల్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ (దక్షిణాసియా) కె.రామకష్ణన్ అన్నారు. మహమ్మారి తర్వాత.. పెప్సికో పానీయాల విక్రయాల్లో గత ఏడాది సెవెనప్, పెప్సి, గాటోరేడ్ వంటి బ్రాండ్ల తక్కువ–చక్కెర, చక్కెర లేని విభాగం ఉత్పత్తుల వాటా పరిమాణం పరంగా 44% ఉంది. ఆఫ్రికా, నేపాల్, శ్రీలంకతో కలిపి.. తక్కువ–చక్కెర, చక్కెర లేని ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ మొత్తం పరిమాణంలో 53% వాటాను కలిగి ఉన్నాయని భారత్‌లో పెప్సికో ఉత్పత్తులను తయారు చేస్తున్న వరుణ్ బెవరేజెస్ తెలిపింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో తక్కువ–కేలరీ, జీరో–షుగర్ ఉత్పత్తులు 50% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. చక్కెర రహిత, తక్కువ చక్కెర పానీయాల పట్ల వినియోగదారులకు కొంత ఆసక్తి ఉన్నప్పటికీ.. కోవిడ్–19 మహమ్మారి తర్వాత వీటి వినియోగంలో గుర్తించదగిన మార్పు వచ్చిందని వివరించారు. ‘కోవిడ్ సమయంలో ఇంటి భోజనానికి, శారీరక శ్రమకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో షుగర్ ఫ్రీ ఆధారిత ఉత్పత్తుల తయారీకి మొగ్గు చూపేలా చేసింది’ అని తెలిపారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిమితులు.. చక్కెర శాతం, కేలరీల సంఖ్య, ఉపయోగించే స్వీటెనర్ రకాన్ని బట్టి సాధారణ, ఆరోగ్యకర పానీయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇటీవలి కాలంలో కృత్రిమ స్వీటెనర్ల వాడకం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వీటి ప్రభావం భారతీయులపై ఏ మేరకు ఉందో పరిశీలిస్తామని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది. స్టీవియా, ఎసిసల్ఫేమ్ పొటా షియం, అస్పాటేమ్, సుక్రలోజ్ వంటి నాన్–కెలోరిక్ స్వీటెనర్ల వాడకానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ భద్రతా పరిమితులను కూడా నిర్దేశించింది. -
Beauty Tips: చర్మం మృదువుగా ఉండాలంటే.. ఇలా చేస్తే చాలు!
పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు పడుతున్నాయి. చాలా రకాల వ్యాధులు ఎదురవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు. చర్మం పొడిబారడం, చారలు, నలుపు, మచ్చలుగా మారడం లాంటివి. మరి ఈ సమస్యలనుండి చర్మం మృదువుగా, నిగారింపుగా ఉండాలంటే.. కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ఇలా చేయండి.. పెసరతో మెరుపు మేనికి పెసరపిండి వాడితే చర్మకాంతి ఇనుమడిస్తుంది. పెసలలో ఉండే ప్రోటీన్లు చర్మ మృదుత్వాన్ని కాపాడతాయి. టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది. టీ స్పూన్ పెసరపిండిలో తగినంత పెరుగు కలిపి ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా అవుతుంది. ఇవి చదవండి: గురక సమస్య అంతింత కాదయా! లైట్ తీసుకుంటే డేంజరే! -
నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! అంటూ గొడవ చేసిన తండ్రి...
Girl vaccinated after her mother’s consent: హర్యానాలోని ఒక వ్యక్తి తన కూతుళ్లుకు వ్యాక్సిన్ వేసినందుకు పెద్ద హంగామ సృష్టించాడు. వ్యాక్సిన్ వేసిన ఆరోగ్యకర్తలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...హర్యానాలోని నిహల్‌గర్ గ్రామంలో ఒక ఆరోగ్యం కేంద్రంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ఇద్దరు బాలికలు తమ తల్లి అనుమతితో ఆరోగ్యం కేంద్రం వద్ద యాంటీ మీజిల్స్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ తట్టు లేదా పొంగు వంటి వ్యాధుల రాకుండా వేసే వ్యాక్సిన్. ఐతే ఇంతలో ఆ బాలికల తండ్రి హరుణ్ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి తన కూతుళ్లకు వ్యాక్సిన్ ఎందుకు వేశారంటూ పెద్ద రగడ చేశాడు. అంతేకాదు వ్యాక్సిన్లు వేసే అంగన్వాడి, ఆశా వర్కరులను దుర్భాషలాడుతూ...చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిర్మలా యాదవ్ అనే ఆరోగ్య కార్యకర్త పోలీసులుకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు హరుణ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతను విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం) -
పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా!
టెహ్రాన్ : మధ్యప్రాచ్య దేశం ఇరాన్లో దాదాపు పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడినట్లు ఆ దేశ వార్తా సంస్థలు గురువారం తెలిపాయి. ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఖాసీమ్ జాన్‌బాబాయి ఈ విషయం తెలిపినట్లు ఐఎస్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది.అయితే కొన్ని రోజుల క్రితం వెలువడ్డ సమాచారం ప్రకారం దాదాపు 800 మంది ఆరోగ్య కార్యకర్తలు వైరస్ బారినపడ్డారు. వీరిలో సుమారు వంద మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ చెబుతోంది. వైరస్ కారణంగా గురువారం నాటికి ఇరాన్లో 7249 మంది మరణించారు. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 1.29 లక్షల మందికి కరోనా సోకింది. బుధవారం నుంచి 24 గంటల్లో 2392 మంది కొత్తగా వ్యాధి బారిన పడ్డారు. -
బాల్యదశలో జాగ్రత్త!
పాలమూరు: బాల బాలికలు ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని.. తద్వారా ఎలాంటి అనారోగ్యం దరిచేరదని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ మాత్రలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది లోపు జిల్లాలో నులిపురుగులు, ఏలికపాములు, కొంకిపురుగులు నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో ఎవరు కూడా మలవిసర్జన చేయకుండా విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులు సైతం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. పిల్లలో కొంకిపురుగులు, నులిపురుగులు కడుపులో ఏర్పడితే పెరుగుదల లోపించడం, రక్తహీనత, చదువుపై శ్రద్ధ కోల్పోవడం జరుగుతుందన్నారు. అంతకుముందు కలెక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేయడంతో పాటు విద్యాబోధనపై ఆరా తీశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రజిని, ప్రోగ్రాం అధికారి డాక్టర్ శశికాంత్, మాస్‌మీడియా అధికారి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కృష్ణ, డాక్టర్లు జరీనా, సునీత, హెల్త్‌ఎడ్యుకేటర్ రాజగోపాలాచారి, ఉమాదేవి, సుభాష్‌చంద్రభోస్, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 85.9శాతం మందికి మాత్రలు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాలో 85.9శాతం మందికి మాత్రలు వేశారు. జిల్లాలోని 15మండలాలు, నారాయణపేట జిల్లాలో 11 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1నుంచి 19 ఏళ్ల లోపు చిన్నారులు, యువతీ యువకులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.జిల్లా వ్యాప్తంగా 4,65,826 మంది బాలబాలికలకు గాను 3,51,568మందికి మాత్రలు వేసినట్లు అధికారులు తెలిపారు. ఇక మిగిలిపోయిన 1,14,258 మంది బాలబాలికలకు ఈనెల 23న మాత్రలు అందించనున్నారు. నులిపురుగు మాత్రలు తప్పనిసరి... భూత్పూర్ (దేవరకద్ర): ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగు మాత్రలు విధిగా వేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రిజిని సూచించారు. భూత్పూర్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఆమె మంగళవారం మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మాత్రలు వేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.కాగా, మండలంలో 10,833 మందికి గాను 7,513 మందికి మాత్రలు వేసినట్లు సీహెచ్ఓ రామయ్య వివరించారు. జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరోగ్యానికి భరోసా
కరీంనగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇప్పటికే కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో మెనూలో పెద్ద ఎత్తున మార్పులు తేవడమే కాకుండా కాస్మోటిక్ కిట్స్ అందిస్తు న్న ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల బాలికల ఆరోగ్యం, పరిశుభ్రత ధ్యేయంగా ఆరోగ్య కిట్లు అందజేసేందుకు శ్రీకారం చుట్టింది. 13 వస్తువులతో కూడిన ఆరోగ్య కిట్ బాలికలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా కిట్లను ప్రభుత్వం జిల్లాలకు విడుదల చేసింది. గత విద్యా సంవత్సరం ఆఖరు నుంచి కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇలాంటి కిట్లు అందజేశారు. ఈసారి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు అందజేస్తుండడం విశేషం. బాలికల ఆరోగ్య రక్షణలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, నిరాక్షరాస్యత కారణంగా పరిశుభ్రతకు, వైద్యసేవలకు నోచుకోని విద్యార్థినుల ఆరోగ్యానికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, ఆదర్శ, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికల కోసం ఆరోగ్య కిట్లు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు అన్ని పాఠశాలల్లో కిట్లను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారుల కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూ ర్తి చేసి కిట్లు సైతం పాఠశాలలకు త్వరలోనే అందేలా అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం కోసం.. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రభుత్వం ఈ కిట్లు పంపిణీ చేస్తోంది. బాలికలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు శానిటరీ న్యాపికిన్స్ సైతం ఈ కిట్‌లో అందజేస్తున్నారు. హెల్త్ అండ్ హైజినిక్ పథకం ద్వారా ఈ కిట్టు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 56,506 మంది విద్యార్థినులకు ఈ కిట్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడు నెలలకోసారి.. ఒక్కో బాలికకు మూడు నెలలకు సరిపోయేలా వస్తువులను కిట్‌లో ఉంచారు. ఇలా ప్రతీ మూడు నెలలకొసారి ఆరోగ్య కిట్ అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. కిట్‌లో ఉండే వస్తువులు.. కిట్‌లో మొత్తం 13 రకాల వస్తువులు ఉన్నాయి. సబ్బులు 3, బట్టల సబ్బులు 3, కొబ్బరినూనె బాటిల్ 1, షాంపూ బాటిల్ 1, పౌడర్ 1, టూత్‌పెస్ట్ 1, టంగ్‌క్లీనర్ 1, దువ్వెన 1, జడ క్లిప్పులు, జడరబ్బర్లు, బొట్టు బిల్లల ప్యాకెట్, శానిటరీ న్యాపికిన్స్. 24 నుంచి పంపిణీ చేస్తాం.. ఆరోగ్య కిట్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 24 నుంచి 30వ తేదీల మధ్య ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో 7 నుంచి 10వ తరగతి వరకు, కేజీబీవీల్లో 6 నుంచి 10వ తరగతి వరకు, మోడల్ స్కూల్లో 7 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికలందరికీ కిట్స్ అందజేయాలని ఉత్తర్వులు అందాయి. విద్యార్థినులను అనారోగ్య సమస్యల బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో పరిశుభ్రత కిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. – వెంకటేశ్వర్లు, డీఈవో, కరీంనగర్ -
బంగారు తల్లి
పింప్రి, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా బాలికల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఆడపిల్లలను భారంగా పరిగణించే సంస్కృతి, లైంగిక నేరాలు, సామాజిక దురాచారాలు, భ్రూణహత్యల వంటి సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆడ శిశువుల జననాల రేటును పెంచడానికి ఎన్నో పథకాలను, చట్టాలను తెచ్చినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ విషయంలో పుణే కార్పొరేషన్ చక్కని ఫలితాలు సాధించి మిగతా స్థానిక ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచింది. కార్పొరేషన్ చేపట్టిన పలు సామాజిక సంక్షేమ పథకాలు, చర్యల వల్ల బాలికల జననాల రేటు చెప్పుకోదగ్గస్థాయిలో పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆరు నెలల కాలంలో ఆడపిల్లల జననాల సంఖ్య సరాసరి 960కు (ప్రతి వెయ్యిమంది పురుషులకు) చేరింది. గత సంవత్సరం జననాలరేటు 934 మాత్రమే ఉండేదని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. భ్రూణహత్యలను నివారించేందుకు పుణే కార్పొరేషన్ ఏడాది పొడవునా గర్భిణుల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టింది. జననీ సురక్ష, ఏక్ లడ్కీ వంటి ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టింది. నగరాలలోని సోనోగ్రఫీ (లింగనిర్ధారణ పరీక్షల కేంద్రాలు), అబార్షన్లు నిర్వహించే ఆస్పత్రులపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అధికారుల బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారి సోనోగ్రఫీ యంత్రాలను జప్తు చేయడం వంటి కఠిన చర్యలకు కూడా కార్పొరేషన్ వెనకాడలేదు. ఫలితంగా బాలికల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2003 మధ్యకాలంలో ప్రతి వెయ్యిమంది బాలలకు బాలికల సంఖ్య 881 ఉండగా, ప్రస్తుతం అది 960కు చేరింది. ఈ ఏప్రిల్‌లోనే ఆడ శిశువుల జననాల రేటు ఏకంగా వెయ్యికి చేరింది. ఈ నెలలో నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో 4,694 మంది శిశువులు జన్మించినట్లు కార్పొరేషన్ ఉప ఆరోగ్య అధికారి డాక్టర్ అంజలి సాబణే తెలిపారు. వీరిలో 2,347 మంది బాలలు, 2,347 మంది బాలికలు ఉన్నారు. అయితే బాలికల వార్షిక జననాల రేటు వెయ్యి కంటే అధికంగా నమోదు చేయడమే తమ లక్ష్యమని స్పష్టీకరించారు. ఈ సంవత్సరం జననాల వివరాలు ఈ ఏడాది జనవరిలో 4,662 మంది పిల్లలు జన్మించగా అందులో 2,013 మంది బాలలు, 2,449 మంది బాలికలు ఉన్నారు. మార్చిలో 5,225 మంది పిల్లలు జన్మించగా 2,723 మంది బాలలు, 2,502 మంది బాలికలు ఉన్నారు. అదేవిధంగా ఏప్రిల్‌లో 4,694 మంది శిశువుల్లో 2,347 మంది బాలలు, 2,347 మంది బాలికలు ఉన్నారు. మేలో 4,668 మంది పిల్లలు జన్మించగా వీరిలో 2,430 మంది బాలురు, 2,238 మంది బాలికలు ఉన్నారు. జూన్‌లో 4,128 మంది శిశువుల్లో 2,164 మంది బాలురు, 1,964 మంది బాలికలు ఉన్నారు. జూలైలో 4,359 మంది జన్మించగా, 2,234 మంది బాలురు, 2,125 మంది బాలికలు ఉన్నారు. ఆగస్ట్‌లో 4,362 మంది శిశువులు జన్మించగా బాలురు 2,225 మంది, బాలికలు 2,137 మంది ఉన్నారు. ఇళ్ల వద్దకే ఆరోగ్య కార్యకర్తలు భ్రూణహత్యలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించిన పుణే కార్పొరేషన్ అక్కడి ఆస్పత్రుల్లో గట్టి నిఘా ఉంచింది. గర్భిణుల వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. వారి బాగోగులను చూసేందుకు ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపి మాతా శిశు సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంది. పైన వివరించిన చర్యల వల్లే మంచి ఫలితాలను రాబట్టగలిగామని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలను గ్రామాల్లో ప్రతి ఇంటికీ పంపి గర్భిణుల వివరాలను సేకరిస్తున్నారు. చికిత్స అవసరమనుకుంటే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. భ్రూణహత్యల నివారణకు భారీగా చర్యలు తీసుకున్న పుణే కార్పొరేషన్ ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచింది. -
వైద్యంపై నిర్లక్ష్యం
సాక్షి, మంచిర్యాల : పల్లెల్లో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. గ్రామీణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ల(ఆరోగ్య కార్యకర్త) నియామకాలు చేపట్టకపోవడంతో గ్రామీణులకు వ్యాధులపై అవగాహన కరువైంది. పురుష ఆరో గ్య కార్యకర్తలు మలేరియా, పైలేరియా, డెంగీ ఇతర సీజనల్ వ్యాధులపై అప్రమత్తం చేయడం, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడంతోపాటు నెలకోసారి గ్రామంలో ప్రతి ఇంటికీ తిరిగి ప్రజలకు ఆరోగ్య విషయాలు తెలపాలి. మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఇమ్యూనైజేషన్(పల్స్ పోలియో, గర్భిణులు, బాలింతల కు అవగాహన) కార్యక్రమాలు చేపట్టాలి. అయితే జిల్లాలో సిబ్బంది కొరత కారణం గా పనిభారం ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తు న్న వారిపైనే పడుతోంది. చాలా గ్రామాల్లో ఇరువురు కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తలను ఆశ్రయించి వారి ద్వారా రిపోర్టులు సేకరించి అధికారులకు నివేదిస్తున్నట్లు సమాచారం. వీరి అలసత్వం కారణంగా పల్లెల్లో వ్యాధులపై ప్రజలకు అవగాహన కరువవుతోంది. సగం పోస్టులు ఖాళీ జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 7,25,048 మంది, సాధారణ ప్రాంతాల్లో 20,63,596 మంది మొత్తం 27,88,644 మంది జనాభా ఉంది. గిరిజన ప్రాంతాల్లో 3 వేలు, సాధారణ ప్రాంతాల్లో 5 వేల జనాభాకు ఒక్కొక్కరి చొప్పున జిల్లాలో మొత్తం 653 మంది మహిళ, అంతే మంది పురుష ఆరోగ్య కార్యకర్తలు ఉండాలి. అయితే జిల్లా వ్యాప్తంగా 653 మహిళ కార్యకర్తలకు 518 పోస్టులు మంజూరయ్యాయి. అందులో కేవలం 420 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 653 మంది పురుష కార్యకర్తల పోస్టులకు గానూ 304 పోస్టులు మాత్రమే మంజూరు కాగా అందులో 140 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న పురుష, మహిళ కార్యకర్తల్లో 20 మంది మాత్రమే రెగ్యులర్ గా ఉన్నారు. మిగిలిన వారందరూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. దీనికి తోడు ఆరోగ్య కార్యకర్తల పనులు పర్యవేక్షించాల్సిన 36 హెల్త్ సూపర్ వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 95 పురుష సూపర్ వైజర్ పోస్టులు మంజూరు కాగా 70 మంది పనిచేస్తున్నారు. 97 మహిళా సూపర్వైజర్లు పోస్టులుంటే 86 మంది ఉన్నారు. ఎనిమిదేళ్ల నుంచి నియామకాలు లేవు.. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పురుష అభ్యర్థులు బోగస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందారని ఎనిమిదేళ్ల క్రితమే కేంద్రం గుర్తించింది. జూన్, 2002కు ముందు సర్టిఫికెట్లు పొందిన వారికే ఉద్యోగాలు కల్పించాలంటూ అప్పట్లోనే ఆదేశించింది. దీంతో ఆ తర్వాత విద్యార్హత పొందిన అభ్యర్థులు మాకూ అవకాశం కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఇంతవరకు ఆ తీర్పు వెలువడలేదు. దీంతో పురుష మల్టీపర్పస్ హెల్త్ నియామకాలకు బ్రేక్ పడింది. మరోపక్క ఏ సమస్య లేని మహిళా ఆరోగ్య కార్యకర్తల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడంతో పోస్టుల భర్తీకి గ్రహణం పట్టుకుంది. దీంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాలో సగానికి పైగా పోస్టులు ఖాళీలు ఉండడం, పనిచేస్తున్న వారందరూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తుండడంతో పల్లెల్లో వైద్యసేవలు అందడం లేదు. కొరవడిన పర్యవేక్షణ పల్లెల్లో పర్యటించి వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన సిబ్బంది సరిగా పని చేస్తున్నారా? లేదా? అని తెలుసుకోవాల్సిన వైద్యాధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విషజ్వరాలు, మలేరియా ప్రబలి పరిస్థితి చేయి దాటిన ప్పుడే స్పందించడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుంది. హెల్త్ సూపర్వైజర్లు పదవీ విరమణ పొందుతుంటే ఆ పోస్టులు హెల్త్ వర్కర్లతో భర్తీ చే స్తున్న ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తల పోస్టులను భర్తీ చేయకపోవడంతో వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఖాళీగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల పోస్టులు వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా మలేరియా అధికారి అల్హం రవి అడుగగా.. పురుష మల్టీ పర్పస్ హెల్త్‌వర్కర్ల అంశం కోర్టులో ఉండడంతో నియామకాలు చేపట్టడం లేదన్నారు. మహిళ వర్కర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి ఉంది.