దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు | fuel prices News: petrol and diesel prices New Rates Here | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

May 15 2026 6:41 AM | Updated on May 15 2026 7:38 AM

fuel prices News: petrol and diesel prices New Rates Here

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాహనదారులకు ఊహించినట్లే షాక్‌ తగిలింది. ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్కసారిగా రూ.3కు పెంచాయి. ఈ పెంపు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో ఇప్పటికే భారంగా ఉన్న ఇంధన ధరలు మరింత పెరిగి ప్రజల జేబులకు మంటలు పెట్టే పరిస్థితి ఏర్పడింది.

👉  పెంపు వెనుక కారణాలు.. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. హర్ముజ్‌ జలసంధి వద్ద ఏర్పడిన అడ్డంకులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతీశాయి. ఈ పరిస్థితిని ముందుగానే కేంద్రం సంకేతాలిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి, కార్‌పూలింగ్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వినియోగం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే రూ.3 రూపాయల చొప్పున పెంపుతో సరిపెట్టాయి ఆయిల్‌ కంపెనీలు.

👉  ప్రజలలో ఆందోళన.. ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరగడం ఖాయం. ఇప్పటికే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు మరింత భారాన్ని మోపనుంది. సోషల్‌ మీడియాలో "ఇది తాత్కాలిక పెంపేనా? లేక యుద్ధం కొనసాగితే మరోసారి పెరుగుతాయా?" అనే చర్చలు మొదలయ్యాయి.

👉 ఆర్థికవేత్తల అభిప్రాయం.. ప్రముఖ ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతున్నారు. "ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా-డిమాండ్‌ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది" అని విశ్లేషిస్తున్నారు. మరోవైపు, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.

తాజా పెంపుతో ప్రధాన నగరాల్లో కొత్త ధరలు

  • ఢిల్లీ: పెట్రోల్‌ ₹97.77, డీజిల్‌ ₹90.67

  • ముంబై: పెట్రోల్‌ ₹106.54, డీజిల్‌ ₹93.03

  • హైదరాబాద్‌: పెట్రోల్‌ ₹110.50, డీజిల్‌ ₹98.70

  • కోల్‌కతా: పెట్రోల్‌ ₹108.45, డీజిల్‌ ₹95.02

  • చెన్నై: పెట్రోల్‌ ₹103.80, డీజిల్‌ ₹95.39

  • బెంగళూరు: పెట్రోల్‌ ₹105.96, డీజిల్‌ ₹93.99

  • పాట్నా: పెట్రోల్‌ ₹108.54, డీజిల్‌ ₹94.78

  • జైపూర్‌: పెట్రోల్‌ ₹108.03, డీజిల్‌ ₹93.49

  • తిరువనంతపురం: పెట్రోల్‌ ₹110.38, డీజిల్‌ ₹99.26

  • చండీగఢ్‌: పెట్రోల్‌ ₹97.30, డీజిల్‌ ₹85.45

మొత్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో వాహనదారులకు షాక్‌ తగిలినప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement