కోవిడ్‌ అలర్ట్‌: బెంగాల్‌లో నలుగురికి చైనా వేరియంట్‌ బీఎఫ్‌7

Four USA Returnees Found With BF 7 Covid Variant In Bengal - Sakshi

కోల్‌కతా: చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమవుతున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బీఎఫ్‌.7 విజృంభిస్తోంది. ఈ వేరియంట్‌ కేసులు ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో నలుగురికి ఈ బీఎఫ్‌.7 సోకినట్లు నిర్ధరణ అయింది. అమెరికా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చిన నలుగురి నమూనాలు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. బీఎఫ్‌.7 వేరియంట్‌ సోకినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. 

కోవిడ్‌ కొత్త వేరియంట్ బీఎఫ్‌7 సోకిన వారిలో ముగ్గురు నదియా జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో వ్యక్తి బిహార్‌ నుంచి వచ్చి కోల్‌కతాలో నివాసం ఉంటున్నాడు. ఈ నలుగురితో సన్నిహితంగా మెలిగిన 33 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. 

గత ఏడాది డిసెంబర్‌ నుంచి విదేశాల నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన వారికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించి పరీక్షిస్తున్నారు. గత వార కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఓ విదేశీయుడితో పాటు ఇద్దరికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. జీనోమ్స్‌ సీక్వెన్సింగ్‌లో వారికి బీఎఫ్‌.7 సోకినట్లు తేలింది.

ఇదీ చదవండి: Fact Check: భారత్‌లో కోవిడ్‌ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top