తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాదిగా పద్మ లక్ష్మీ

First Transgender Lawyer In Padma Lakshmi From Kerala - Sakshi

కేరళకు చెందిన పద్మాలక్ష్మీ తొలి ట్రాన్స్‌జెండర్‌ న్యాయవాదిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌ జెండర్‌ జడ్జీగా నిలిచిన జోయిత్‌ మోండల్‌ తర్వాత పద్మ లక్ష్మీ అనే ట్రాన్స్‌జెండర్‌ ఆ విజయాన్ని సాధించారు. ఈ మేరకు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని చెబుతూ..ఆమె ఫోటోలను కూడా షేర్‌ చేశారు. ఆమె గురించి మాట్లాడుతూ..ఆదివారం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన బార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్టిఫికేట్‌ కార్యక్రమంలో నమోదు చేసుకున్న 1500 మందికి పైగా లా గ్రాడ్యుయేట్‌లలో పద్మాలక్ష్మీ కూడా ఒకరు.

ఆమె ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాలలో పట్టుభద్రురాలైందని చెప్పారు. తన కోసం ఒక మార్గాన్ని ఎంచుకుని ఆ దిశగా విజయాన్ని అందుకోవడం కోసం ఎన్నో అడ్డంకులను ఎదుర్కొందని, ముఖ్యంగా సమాజం నుంచి ఎదురై చీత్కారాలను అధిగమించి అనుకున్న గమ్యానికి చేరుకుని విజయం సాధించిందని ప్రశంసించారు. ఎట్టకేలకు ఆమె అనుకున్న లక్ష్యం సాధించి న్యాయచరిత్రలో తన పేరును నమోదు చేసుకుందన్నారు. ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే గాక తనలాంటి వాళ్లు ఈ రంగంలో వచ్చేందుకు ఒక ప్రేరణగా నిలుస్తుందన్నారు మంత్రి రాజీవ్‌.

దీంతో నెటిజన్లు అడ్వకేట్‌ కమ్యూనిటీకి అభినందనలు, స్వాగతం అంటూ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా తొలి ట్రాన్స్‌జెండర్‌ జడ్జి జోయితా మోండల్‌ తదనంతరం 2018లో ట్రాన్స్‌జెండర్‌ కార్యకర్త విద్యా కాంబ్లే మహారాష్ట్రలో నాగ్‌పూర్‌లోని లోక్‌ అదాలత్‌ జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఏడాదే మూడో ట్రాన్స్‌జెండర్‌ జడ్జిగా గౌహతి నుంచి స్వాతి బిధాన్‌ నియమితులయ్యారు.

(చదవండి: ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్‌!: కేంద్ర మంత్రి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top