Rajasthan First Heritage Train: రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలు ప్రారంభం

First Heritage Train Starts Operations In Rajasthan - Sakshi

జైపూర్: రాజస్థాన్‌లో మొదటి హెరిటేజ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్‌ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది.  

రైలు ప్రత్యేకతలు..
ఈ హెరిటేజ్ రైలులో 60 మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారు. పర్యటక ప్రదేశాలను చూడటానికి ట్రైన్‌లో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు. గోరమ్‌ ఘాట్(రాజస్థాన్ మినీ కశ్మీర్‌), భిల్ బేరీ వాటర్‌ఫాల్‌ వంటి ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణం సాగుతుంది. రైలు రూపకల్పన 150 ఏళ్ల నాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబిస్తుంది. 

రైలు వేళలు..
మార్వార్ జంక్షన్ వద్ద ఉదయం 8:30కు ప్రారంభమైన ఈ రైలు కామ్లిఘాట్ వద్దకు ఉదయం 11 గంటలకు చేరుతుంది. వారానికి నాలుగు సార్లు ఈ రైలు ప్రయాణం ఉంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ హెరిటేజ్ రైలు.. సాయంత్రం 5:30కి మార్వార్ చేరుతుంది.

హెరిటేజ్ రైలు ప్రయాణానికి ఒక్కొ టికెట్‌కు రూ.2000 వసూలు చేయనున్నారు. హెరిటేజ్ రైలు ప్రారంభం సందర్భంగా బీజేపీ ఎంపీ దివ్యా కుమారి తన మొదటి ప్రయాణం అద్భుతంగా ఉందని వెల్లడించారు. UNESCO భారత్‌లో నాలుగు రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే (1999), నీలగిరి మౌంటైన్ రైల్వే (2005), కల్కా సిమ్లా రైల్వే (2008), ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై (2004)లు అందులో ఉన్నాయి. మథెరన్ లైట్ రైల్వే,  కాంగ్రా వ్యాలీ రైల్వే తాత్కాలిక జాబితాలో ఉన్నాయి. 

ఇదీ చదవండి: అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top