
చండీగఢ్: పంజాబ్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. నిరాశ్రయులైనవారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో వరద బాధితులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న బీజేపీ- ఆప్‌లు బాధితులకు సాయం అందిస్తూ.. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు నిచ్చెన వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంజాబ్‌లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అమృత్‌సర్, గురుదాస్‌పూర్, కపుర్తలాలోని పలు గ్రామాలను సందర్శించిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు, తాను రాష్ట్రానికి వచ్చానన్నారు. ‘పంజాబ్‌లో సంభవించిన వరదలను సమీక్షించేందుకు ప్రధాని నన్ను పంపారు. మేము పంజాబ్‌కు అండగా నిలుస్తున్నాం’ అని ఆయన అన్నారు. వరదలు పలు పంటలను నాశనం చేశాయని, తదుపరి సీజన్ సాగుకు కూడా ముప్పు కలిగించాయని ఆయన అన్నారు. తాను ఒక మంత్రిగా ఇక్కడికి రాలేదని, పంజాబ్ రైతుల సేవకునిగా వచ్చాయని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.
అయితే శివరాజ్ సింగ్ మాటలకు స్పందించిన అధికార అప్ నేతలు2023లో హిమాచల్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదలు పంజాబ్‌ను అతలాకుతలం చేసినప్పుడు కేంద్ర మంత్రులెవరూ రాష్ట్రంలో పర్యటించలేదని, ఆ సమయంలో బీజేపీ ముందుకొచ్చి ఎందుకు వరద సహాయక చర్యలు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. 2024–25 కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌కు వరద ఉపశమనంగా రూ.11,500 కోట్లు కేటాయించినప్పటికీ, పంజాబ్‌కు కేవలం ప్రకటన మాత్రమే చేశారని ఆప్ నేతలు ఆరోపించారు. అయితే ప్రస్తుత వరదల సమయంలో మేమున్నామంటూ బీజేపీ నేతలు వస్తున్నారని ఆప్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ స్వయంగా ట్రాక్టర్‌ను నడిపి, చౌహాన్‌ను వరద ప్రభావిత గ్రామాలకు తీసుకెళ్లారు. జలంధర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ట్రక్కుపై సహాయ సామగ్రిని లోడ్ చేస్తూ, తన భుజాలపై రేషన్ సంచులను మోసుకెళ్లారు. అలాగే బీజేపే మహిళా నేత, మాజీ కేంద్ర సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ భార్య అనితా సోమ్ ప్రకాశ్ ఫగ్వారాలో రేషన్ కిట్‌లను పంపిణీ చేశారు. ప్రస్తుతం పంజాబ్ అసెంబ్లీలో బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2024 ఎన్నికల్లో 18.5శాతం ఓట్ల వాటాను పొందినప్పటికీ పార్టీ రాష్ట్రం నుండి ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. 2020-21లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత పార్టీకి ఇటువంటి పరిణామాలు ఏర్పడ్డాయి. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.