కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదీ.. జైలు కాదు ఇంట్లో!! | Sakshi
Sakshi News home page

కలెక్టర్ హత్య కేసులో జీవిత ఖైదీ.. జైలు కాదు దర్జాగా భార్యాకొడుకులతో ఇంట్లో!! ఫొటో దుమారం

Published Tue, Aug 16 2022 10:22 AM

Ex RJD leader Anand Mohan With Family Photo Viral - Sakshi

పాట్నా: కలెక్టర్‌ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ(మాజీ) నేత.. జైలుకు బదులుగా ఇంటికి చేరడం, కుటుంబం.. అనుచరులతో సరదాగా గడపడం పెనుదుమారం రేపుతోంది. ఫొటోకాస్త వైరల్‌ కావడంతో ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన ఆరుగురు పోలీస్‌ సిబ్బందిపై వేటు వేసిన బీహార్‌ పోలీస్‌ శాఖ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. 

ఆర్జేడీ నేత బాహుబలి ఆనంద్‌ మోహన్‌.. తుపాకులు, కత్తులతో స్వేచ్ఛగా విహరించడంతో పాటు ఫొటోలకు ఫోజులు ఇచ్చే నేతగా పేరుండేది. అయితే  1994లో ముజాఫర్‌పూర్‌ శివారులో గోపాల్‌గంజ్‌ కలెక్టర్‌ కృష్ణయ్యను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు ఆనంద్‌కు మరణ శిక్ష విధించింది. అయితే.. పాట్నా హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది. సుప్రీంకోర్టులోనూ ఆనంద్‌కు ఊరటే లభించింది కూడా. 

మోహన్‌, ఆయన భార్య గతంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ సభ్యులుగా వ్యవహరించారు. మోహన్‌ తనయుడు చేతన్‌ ఆనంద్‌ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ తరుణంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బాహుబలి ఆనంద్‌ మోహన్‌ను పాట్నా కోర్టులో ప్రవేశపెట్టిన సిబ్బంది.. జైలుకు కాకుండా నేరుగా ఆయన ఇంటికి తీసుకెళ్లారు.   అక్కడ భార్య లవ్లీ ఆనంద్‌, కొడుకు చేతన్‌ ఆనంద్‌, పార్టీ కార్యకర్తలతో గ్రూప్‌ ఫొటోలు దిగాడు మోహన్‌. సరదాగా పార్టీల్లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు రెండు రోజుల తర్వాత వైరల్‌ కావడంతో రాజకీయ దుమారం మొదలైంది. 

రిటర్న్‌ ఆఫ్‌ జంగిల్‌రాజ్‌ 
బీజేపీ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. రిటర్న్‌ ఆఫ్‌ జంగిల్‌ రాజ్‌ అంటూ మోహన్‌ కుటుంబ ఫొటోను వైరల్‌ చేస్తోంది. లాలూ-రబ్రీ కాలం మళ్లీ వచ్చేసిందంటూ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒక జీవిత ఖైదును ఇంటికి అనుమతించినందుకు ఆరుగురు సిబ్బందిపై వేటు వేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఫొటోపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సహస్రా ఎస్పీ లిపీ సింగ్‌ వెల్లడించారు.

అయితే బీజేపీ విమర్శలపై యువ ఎమ్మెల్యే చేతన్‌ ఆనంద్‌ తీవ్రంగా స్పందించాడు. కోర్టు బయట అనారోగ్యానికి గురైన తన తండ్రిని ఇంటికి తెస్తే తప్పేంటని అంటున్నాడు. అనుచరులతో తన తండ్రి సమావేశం అయిన ఫొటోను సైతం బీజేపీ వక్రీకరిస్తోందని, వాస్తవాలను వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. వాజ్‌పేయి హయాంలో విశ్వాస తీర్మానం సందర్భంగా.. తన తండ్రి, మరో పది మంది ఎంపీలను ఒప్పించి అనుకూలంగా ఓటు వేయించడని, అప్పుడు లేని ఇబ్బంది బీజేపీకి ఇప్పుడు కలుగుతుందో అర్థం కావడం లేదని కౌంటర్‌ ఇచ్చాడు ఎమ్మెల్యే చేతన్‌ ఆనంద్‌. 

ఇదీ చదవండి: పింక్‌ వర్సెస్ ఆరెంజ్‌.. ఎగిరిన రాళ్లు, విరిగిన కర్రలు

Advertisement
 
Advertisement
 
Advertisement