తమిళనాట హోరాహోరీ | Elections campaigning ends in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాట హోరాహోరీ

Apr 22 2026 3:36 AM | Updated on Apr 22 2026 3:36 AM

Elections campaigning ends in Tamil Nadu

ముగిసిన ప్రచారం 

234 సీట్లకు రేపు పోలింగ్‌  

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజులపాటు హోరాహోరీగా కొనసాగిన ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు గడువు ముగిసే చిట్టచివరి క్షణం వరకు నేతలు రోడ్‌ షోల ద్వారా పోటాపోటీగా ప్రచారం సాగించారు. అసెంబ్లీలోని మొత్తం 234 నియోజకవర్గాలకు ఈ నెల 23వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అర్హులైన 5.73 కోట్ల మంది ఓటర్లు బరిలో ఉన్న 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌(ఈసీ) విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

రాష్ట్రంలో అధికార డీఎంకే సారథ్యంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్‌(ఎస్‌పీఏ)కి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏకి ప్రధాన పోటీ నెలకొంది. ఎస్‌పీఏలో డీఎంకే, కాంగ్రెస్‌లతోపాటు వామపక్షాలు, వీసీకే, ఎంఎంకే తదితర పారీ్టలున్నాయి. ఎడపాడి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడీఎంకే, బీజేపీ తదితర పార్టీలతో జట్టుకట్టింది. సినీ నటుడు విజయ్‌కి చెందిన టీవీకే, ఒకప్పటి సినీ దర్శకుడు సీమాన్‌కు చెందిన నామ్‌ తమిళార్‌ కట్చి మొత్తం 234 సీట్లలో బరిలో నిలిచాయి. దీంతో, ప్రధానంగా బహుముఖ పోటీ నెలకొంది.  

మహామహుల ప్రచారం.. 
ఎన్నికల ప్రచారంలో డీఎంకే కూటమి తరఫున సీఎం ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి, కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, ఆ పార్టీ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీ తదితరులు పాల్గొన్నారు. అన్నాడీఎంకే కూటమి తరఫున పళనిస్వామితోపాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. డీఎంకేకు మద్దతు తెలిపిన సినీ నటుడు కమల్‌ హాసన్‌కు చెందిన మక్కల్‌ నీది మయ్యమ్‌ ఈ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. చివరి రోజైన మంగళవారం సొంత కొళత్తూరు నియోజకవర్గంలో రోడ్‌ షో ద్వారా సీఎం స్టాలిన్‌ ప్రచారం ముగించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చెన్నైలో రోడ్‌షో నిర్వహించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్‌ చెన్నై నందనంలో జరిగిన సభతో ప్రచారం ముగించారు. 

ఎండల వేడిని మరిపించిన ప్రచారం 
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేసవి ఎండలను మించిన వేడెక్కించింది. ప్రధాన వైరిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకేలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. డీఎంకేకి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జతయ్యారు. అన్నాడీఎంకే కేవలం ముసుగు మాత్రమే దీని వెనుక కథ నడిపించేదంతా బీజేపీయే నంటూ వ్యాఖ్యానించారు. ఎన్‌డీయేకి అధికారమిస్తే మోదీ ఆడించినట్లుగా ఆడే కీలు బోమ్మ సీఎం రాష్ట్రానికి వస్తారని విమర్శించారు. అన్నాడీఎంకేను ఢిల్లీ నుంచి బీజేపీ కంట్రోల్‌ చేస్తుందని, ఇక్కడి పోరును తమిళనాడు వర్సెస్‌ ఎన్‌డీఏ–ఢిల్లీ పోరుగా సీఎం స్టాలిన్‌ అభివర్ణించారు.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే తమిళనాడు సూపర్‌స్టార్‌ అయ్యిందని చెప్పుకొచ్చారు. దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రం కానుందని, దక్షిణాసియాలోనే ఆదర్శం అవుతుందని చెప్పారు. ఈ విమర్శలకు అన్నాడీఎంకే చీఫ్‌ పళనిస్వామి దీటుగా బదులిచ్చారు. తమ పార్టీని ముక్కలు చేసేందుకు డీఎంకే కుట్ర పన్నగా తాము వాటిని సాగనివ్వలేదని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement